16-10-2025 08:20:49 PM
ఇద్దరు కూతుళ్ల మధ్య తలెత్తిన వివాదం
మూడు రోజులైన కదపని తల్లి శవం
కూతుళ్ల తీరుపై సర్వత్రా విమర్శలు
నూతనకల్/ఆత్మకూరు: అమ్మకు ఆఖరి గౌరవమే అత్యంత విలువైన ఆస్తి. అయితే ఆస్తి పంపకాల పేరిట ఓ అమ్మకు అవమానం జరిగింది. అమ్మ పంచిన ప్రేమ, ఆమె పిల్లలకు చేసిన సేవ అన్ని ఆస్తి ముందు దిగదుడుపుగా మారిపోయాయి అనడానికి మంచి ఉదాహరణ ఈ సంఘటన. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండల కేంద్రానికి చెందిన పొదిల నరసమ్మ వయసురిత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలతో మృతి చెందింది. కాగా ఆమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వెంకటమ్మ, చిన్న కూతురు కళమ్మ. కుటుంబంలో ఉన్న ఆస్తిని ఇద్దరికి వాటాలుగా పంచి, కొంత ఆస్తి, డబ్బు, బంగారం తన వద్ద ఉంచుకుంది. అయితే నరసమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆ డబ్బు, బంగారం మొత్తాన్ని చిన్న కూతురు వద్ద భద్రపరిచినట్లు స్థానికుల ద్వారా తెలిసింది.
అయితే మూడు రోజుల కిందట నరసమ్మ మృతి చెందగా తల్లి వద్ద ఉన్న నిల్వ డబ్బుతో అంత్యక్రియలు చేయాలని పెద్ద కూతురు వెంకటమ్మ సూచించినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఆ డబ్బు ఖర్చులకు అయిపోయిందని చిన్న కూతురు తెలిపిందన్నారు. ఇదే విషయమై ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో చిన్న కూతురు కళమ్మ అంత్యక్రియలు జరగకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయిందన్నారు. దీంతో చెల్లెలు రాకుండా, తండ్రి లేకుండా అంత్యక్రియలు చేస్తే తనపై నిందలు వస్తాయని వెంకటమ్మ దహన కార్యక్రమాలు నిలిపివేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి మరణించి మూడు రోజులు గడుస్తున్నా, కనీసం చివరి గౌరవం ఇవ్వడానికి కూడా ముందుకు రాని కూతుళ్ల తీరును గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా నరసమ్మ అంత్యక్రియలను త్వరగా పూర్తి చేయాలంటున్నారు.