16-10-2025 08:22:49 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి (విజయక్రాంతి): ఖరీఫ్ 2025-26 సీజన్లో ఎఫ్ ఏ క్యూ నిబంధనల ప్రకారం ఉన్న నాణ్యమైన వరి ధాన్యాన్ని సేకరించే విధంగా కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పౌరసరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2025-26 సీజన్ కొనుగోళ్లకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ తో పాటు మహబూబ్నగర్ జిల్లా డిసిసిబి చైర్మన్ మామిల్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎఫ్ ఏ క్యూ ప్రమాణాల ప్రకారం ఉన్న నాణ్యమైన ధాన్యాన్ని గుర్తించడంపై ఎంఏఓ లకు, ఏఈఓ లకు అవగాహన కల్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు ఎఫ్ ఏ క్యూ ప్రమాణాలు కలిగిన నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో సేకరించే విధంగా ఇన్చార్జిలకు సోమ, మంగళవారాల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి పీపీసీ ఇన్ఛార్జికి తప్పనిసరిగా ధాన్యం కొనుగోళ్లపై మంచి అవగాహన కల్పించాలన్నారు. నిర్దేశించిన తేమశాతం ఉండేలా, తాలు లేకుండా ధాన్యం ఉండేలా వారికి సూచనలు చేయాలన్నారు. గత సీజన్ లో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల నుంచి కొంత ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొన్న కలెక్టర్ ఈసారి ఆ పరిస్థితులు తీసుకురావద్దని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు ఆదేశించారు. తప్పనిసరిగా నిర్దేశించిన వాహనాలు వరి ధాన్యం తరలింపు నాకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు.
పీపీసీ లకి ఏ మిల్లును కేటాయించడం జరుగుతుందో అదే మిల్లుకి ధాన్యాన్ని తరలించాలని సూచించారు. ఈ విషయంలో మిల్లర్లు కూడా కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మిల్లర్లు రైతులకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు రానీయకుండా జాగ్రత్త పడాలన్నారు. ధాన్యం మిల్లుకి వచ్చిన వెంటనే ట్రక్ షీట్లను వాట్సాప్ ద్వారా పంపి రైతులకు వెంటనే నగదు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. మిల్లర్లకు ఏవైనా సమస్యలు తెలియజేస్తే పరిష్కార మార్గం చూపించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డిఎం జగన్, డి ఆర్ డి ఓ ఉమాదేవి, డి సి ఓ రాణి, డిటిఓ మానస, డి ఎం ఓ స్వరణ్ సింగ్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కొత్తకోట మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రశాంత్, పాక్స్ సీఈవోలు, ఎంఏవోలు, ఏఈవోలు, ఐకెపి ఎపిఎంలు తదితరులు పాల్గొన్నారు.