07-01-2026 12:40:28 AM
బూర్గంపాడు, జనవరి6,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాకలోని మసీదు రోడ్డు సీసీ రోడ్డు వేసి నెలలు గడుస్తున్నాయి. కానీ ఆ రోడ్డుకు ఇరువై పులా మట్టిని వేయడం మరిచి పోయారు. ఎదురెదురుగా వాహనాలు వస్తే వెళ్లడానికి దారిలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం మసీదు రోడ్డు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెళ్తున్న ఓ కారు, స్కూల్ పిల్లల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయాయి.
సిసి రోడ్డు అంచుకు వెళ్లిన క్రమంలో, రోడ్డు పక్కన ఉండాల్సిన మట్టి నింపకపోవడంతో కారు,స్కూల్ బస్సు కిందకి జారిపోయి ప్రమాదానికి గురయ్యాయి. అదృష్టవశాత్తు బస్సులోని పిల్లలకు,ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోడ్డు వేసి రెండు నెలలు పైగా అవుతున్నా, మట్టిని వేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డుకు ఇరువైపులా మట్టి వేయించాలని వాహనదారులు,గ్రామస్థులు కోరుతున్నారు.