సర్వే పరికరాలతో కచ్చితమైన కొలతల వివరాలు
రాజన్న సిరిసిల్ల, జనవరి 6(విజయ క్రాంతి): అధునాతన పెన్ టెక్స్ రోవర్స్ సర్వే పరికరాలతో ఇండ్ల, స్థలాల కచ్చితమైన కొలతల వివరాలు అందుబాటులోకి వస్తాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ హైదరాబాద్ నుంచి కేటాయించిన మూడు పెన్ టెక్స్ రోవర్స్ సర్వే పరికరాలు జిల్లాకు చేరుకోగా, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఇన్స్పెక్టర్ అఫ్ సర్వే శ్రీనివాస్ తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.
వేములవాడ మున్సిపల్ పరిధిలో నక్ష భూసర్వే కార్యక్రమం కింద పట్టణంలోని అన్ని గృహ, ఇతర అన్ని వివరాలను పెన్ టెక్స్ రోవర్స్ సర్వే పరికరాలతో కచ్చితమైన కొలతల వివరాలు నమోదు అవుతాయని వెల్లడించారు. దీంతో ప్రతి ఒక్క ఇంటి సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణం వివరాలు ఈ పరికరం ద్వారా సర్వే చేస్తారని, ఆ వివరాలు శాటిలైట్ లో నమోదు అయి,
కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ సందర్బంగా జిల్లాలోని ఇద్దరు డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్స్ వెంకటాచారి, వెంకటరత్నం, ఐదుగురు సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లకు పెన్ టెక్స్ రోవర్స్ సర్వే పరికరాలపై కంపెనీ బాధ్యుడు మూర్తి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రాం రెడ్డి, అధికారులు ఉన్నారు.




