10 April, 2026 | 12:03 PM

పెన్‌తో రాశారా.. మెషీన్ గన్‌తోనా అని డౌటొచ్చింది!

28-12-2025 12:45 AM

ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్‘. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తు న్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. 

 ఈ కార్యక్రమంలో కథానాయకుడు ప్రభాస్ మాట్లాడుతూ.. “ఇది నానమ్మ, మనవడి కథ. జరీనా వాహబ్ నాకు నానమ్మ క్యారెక్టర్‌లో నటించారు. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తూ ఉండిపోయా. ఆమె నటనకు ఫ్యాన్‌ను అయ్యాను. నాతోపాటు జరీనా కూడా ‘రాజాసాబ్’లో హీరోనే. రిద్ధి, మాళవిక, నిధి.. ముగ్గురూ బ్యూటిఫుల్ హీరోయిన్స్. పర్‌ఫార్మెన్స్, స్క్రీన్‌ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటారు. ఒకరోజు వేదిక మీద నా స్పీచ్ ఇస్తా, షాకైపోతారు. బడ్జెట్ పెరిగినా ఎంతో ధైర్యంగా విశ్వప్రసాద్ సినిమా నిర్మించారు. ఈ సినిమాకు హీరో ఆయనే. ఈ రేంజ్ హారర్ ఫాంటసీ సినిమాకు తమన్ మాత్రమే మ్యూజిక్ చేయగలడు అనిపించింది.

తమన్ చేతుల్లో మా సినిమాను పెట్టాం. డీవోపీ కార్తీక్ ఎంతో స్పీడ్‌గా క్వాలిటీగా మూవీ చేశారు. సొలమన్, రామ్‌లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మూడేళ్ల రాజాసాబ్ స్ట్రెస్, బాధ్యత అన్నీ కలిసి మారుతికి కన్నీళ్లు వచ్చాయి. ఈ మూవీ క్లైమాక్స్‌కు వచ్చేసరికి మారుతి రైటింగ్‌కు నేను ఫ్యాన్ అయ్యా. ఆయన పెన్‌తో రాశారా.. మెషీన్ గన్‌తో రాశారా అనే డౌటొచ్చింది. హారర్ కామెడీలోనే కాదు.. ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. సీనియర్స్ సీనియర్సే, వాళ్ల దగ్గరనుంచే మేము నేర్చుకున్నది. సంక్రాంతికి అన్ని సినిమాలతోపాటు మా రాజాసాబ్ కూడా బ్లాక్‌బస్టర్ కావాలి” అన్నారు. 

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. “రాజాసాబ్’ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్, మరొకరు విశ్వప్రసాద్. ప్రభాస్ ‘ఆదిపురుష్’లో రాముడిగా నటిస్తున్నప్పుడు ఈ మారుతి ఆయన దగ్గరకు వెళ్లాడు. రాజాసాబ్ కథ విని ప్రభాస్ చాలా నవ్వుకున్నారు. అయితే ఆయనకు ఈ సినిమా చేయా ల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రపంచమంతా ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. నేను 11 సినిమాలు చేశాను, నువ్వు పెద్ద రేంజ్ దర్శకుడివి కావాలని రెబల్ యూనివర్సిటీలో ప్రభాస్ అవకాశం కల్పించారు.

నేను రాసి, తీశాను కానీ ప్రభాస్ ఈ సినిమాతో మమేకమైన తీరు, సపోర్ట్ మాటల్లో చెప్పలేను. సంక్రాంతికి చాలా మూవీస్ వస్తున్నా విశ్వప్రసాద్ చాలా ధైర్యంగా రాజాసాబ్‌ను తీసుకొస్తున్నారు. అన్ని భాషల్లో రాజాసాబ్ సాధించే విజయం మామూలుగా ఉండదు.  ఈ సినిమా సీన్స్ ఆర్‌ఆర్ చేసిన తర్వాత చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి. ప్రభాస్ పర్‌ఫార్మెన్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. ప్రభాస్‌కు ఎంతైనా రుణపడి ఉంటాను. నేను సాధారణంగా కన్నీళ్లు పెట్టుకోను. కానీ ప్రభాస్ ఇచ్చిన లవ్, సపోర్ట్‌కు.. ఆయన నా ముందు చూస్తూ ఎమోషనల్ అవుతున్నా. ఈ సినిమా మీలో ఎవర్ని ఒక్క సీన్ నిరాశపర్చినా, నా ఇంటి అడ్రెస్ ఇస్తా రండి” అన్నారు. 

టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “గ్లోబల్‌గా హారర్ ఫాంటసీ జానర్‌లో రాజాసాబ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుంది” అని చెప్పారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “ప్రతి సంక్రాంతికి కోళ్ల మీద పందేలు వేస్తాం, ఈసారి డైనోసార్ మీద వేయబోతున్నాం. పండక్కి వస్తున్నాం, పండగ చేస్తున్నాం” అన్నారు. నటీనటులు జరీనా వాహాబ్, వీటీవీ గణేశ్, మహేశ్ ఆచంట, రోహిత్, సప్తగిరి, గీత రచయిత కాసర్ల శ్యామ్, నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని, మిగతా చిత్రబృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం, గౌరవం. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సరసన నటిస్తూ, రాజాసాబ్ లాంటి ప్రెస్టీజియస్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెడతానని ఊహించలేదు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు రెబల్ స్టార్, రెబల్ గాడ్. కానీ మా అందరికీ రాజాసాబ్. ఆయన మంచి మనసున్న స్టార్. రాజా సాబ్ సినిమాలో భైరవి క్యారెక్టర్‌లో నటించాను. హీరోయిన్స్‌కు రొమాన్స్, సాంగ్స్ మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్టర్ మారుతి నాతో ఈ మూవీలో రొమాన్స్, సాంగ్స్‌తోపాటు కామెడీ, డ్రామా, యాక్షన్ కూడా చేసే అవకాశం ఇచ్చారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న రాజాసాబ్ థియేటర్లలో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది.

-మాళవిక మోహనన్

ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్‌తో కలిసి సినిమా చేయడం కల నిజమైన అనుభూతి కలిగిస్తోంది. ఆయన ఎంతమంచి వారో మాటల్లో చెప్పలేను. గల్లీలో సిక్స్ కొట్టడం కాదు స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ప్రభాస్ రేంజ్ అది. 

-నిధి అగర్వాల్ 

రాజాసాబ్ పర్పెక్ట్ ఎంటర్‌టైనర్ మూవీ. ప్రభాస్ మనందరికీ డార్లింగ్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రభాస్‌ను మరింత ఇష్టపడతారు.

-రిద్ధి కుమార్