calender_icon.png 28 December, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా మాటల్లో దొర్లీనా తప్పులకే సారీ!

28-12-2025 12:50:07 AM

మహిళా కమిషన్‌ను కలిసిన అనంతరం మీడియాతో నటుడు శివాజీ 

ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని సినీ నటుడు శివాజీ స్పష్టం చేశారు. ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో శివాజీపై విమర్శలు రావటంతో మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు శివాజీకి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన శనివారం మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలిసి వివరణ ఇచ్చారు. ఇకపై మహిళల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని ఈ సందర్భంగా శివాజీకి మహిళా కమిషన్ సూచించింది.

అనంతరం శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. “నా మీద అంత జలసీ రావడానికి నేనేం తప్పు చేశాను. మీ నాన్న చెప్పడా.. మీ అమ్మ చెప్పదా.. ఇంట్లో ఇలాంటి మంచి మాటలు?! అందరూ స్త్రీని మహాలక్ష్మిలానే చూడాలనుకుంటారు. ఎవరెలా బట్టలు వేసుకుంటే నాకేంటమ్మా. మీ బట్టలు మీ ఇష్టం. నేను ఒక తండ్రిలాగా నా బిడ్డలు అని భావించి చెప్పాను. సినిమా పబ్లిసిటీ కోసం దిగజారాను అని అంటారా? నాకు అంత డబ్బు, ఫేమ్ కావాలని ఉంటే రాజకీయాల్లో ఎక్కడో ఉండేవాడిని. మంచి మాటలు, సలహాలు ఇవ్వకూడదని తెలిసిందిక. నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డవారి వల్ల కమిషన్ ప్రశ్నలు అడిగింది. చైర్‌పర్సన్ హుందాగా వ్యవహరించారు.

ఆమె అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. కమిషన్ మళ్లీ పిలిచినా వస్తాను. నేను అన్న మాటల్లో ఏది తప్పు అనిపిస్తే దానికే సారీ. నేను మంచి చెప్పాను. మంచి చెప్పడం కూడా తప్పే. నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. నాపై కుట్ర జరుగుతోంది. నాతో కెరీర్ మొదలుపెట్టిన వారికి నాపై కోపం ఉంది. నా వ్యాఖ్యల తర్వాత నన్ను ఇబ్బందిపెట్టాలని కొందరు జూమ్ మీటింగ్ పెట్టుకొని చర్చించారు. నాకు బాగా కావాల్సినవారు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు. నేను ఎవరికీ భయపడను. బెదిరిస్తే భయపడను. విలువలు లేని బతుకు నేను బతకట్లేదు. అన్నిటికి కాలం, కర్మ సమాధానం చెప్తుంది. యధార్థ వాది లోక విరోధి. నాకు సినిమా ఛాన్సులు ఇవ్వకపోతే నాకు 30 ఎకరాల పొలం ఉంది. వెళ్లి వ్యవసాయం చేసుకుంటా” అన్నారు. 

ఏ బట్టల సత్తిగాడి మాటలూ వినక్కర్లేదు: ఎస్‌కేఎన్ 

పతంగ్ సినిమా సక్సెస్ మీట్‌కు హాజరైన టాలీవుడ్ నిర్మాత ఎస్‌కేఎన్ శివాజీ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. ‘అమ్మాయిలు, హీరోయిన్స్ మీకు ఏ డ్రెస్ కంఫర్ట్‌గా ఉంటే ఆ డ్రెస్ వేసుకోండి. ఏ డ్రెస్ కాన్ఫిడెన్స్‌గా ఉంటే అది వేసుకోండి. ఏ బట్టల సత్తిగాడి మాటలూ వినక్కర్లేదు. కాన్ఫిడెన్స్ అనేది గుండెలోంచి వస్తుంది. వేసే బట్టల్లోనుంచి కాదు. ఏం జరిగినా మన మనసు నుంచే ఉంటుంది. మనసు బాగుంటే అన్నీ మంచిగానే అనిపిస్తాయి’ అన్నారు. 

గిల్లితే గిల్లించుకోవాలని చెప్తారా?: ప్రకాశ్‌రాజ్  

శివాజీ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “శివాజీ చాలా చెత్తగా మాట్లాడాడు. ఆడవాళ్లంటే మీరేమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి? మీలో ఉన్నదేగా బయటకి వస్తుంది. ఆడవాళ్లపై ఆ మాటలేంటి? ఆ అహంకారం ఏంటి? తరతరాలుగా ఆడవాళ్లకు మగవాళ్ల నుంచే కదా అన్యాయం జరుగుతోంది. ఒక వేదిక మీద మాట్లాడు తున్నప్పుడు నీకు సంస్కారం ఉండాలి. ఆడవాళ్ల శరీర భాగాలపై కామెం ట్స్ చేయడం తప్ప. అనసూయని, అనసూయ లాంటి వారిని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్లకు సపోర్ట్ చేయడం నా బాధ్యత. అది మా కర్తవ్యం. శివాజీ గానీ, ఎవరైనా గానీ.. ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.

కచ్చితంగా శివాజీ అన్న మాటలు చాలా తప్పు. ఒక సభ్యసమాజంలో అలా మాట్లాడకూడదు. అసలు నువ్వెవరు చెప్పడానికి? ఫస్ట్ నీ దృష్టి మార్చుకో. అమ్మాయి లను గిల్లేది మగవాళ్లే కదా.. ఆడవాళ్లు కాదుగా?! ‘పోకిరి’ సినిమాలో మాదిరిగా గిల్లితే గిల్లించుకోవాలి అని చెప్తారా? చాలా తప్పు. ఇక అనసూయ ట్వీట్‌పైనా ప్రకాశ్‌రాజ్ స్పందించారు. “ఆ సంస్కారవంతులను మొరుగుతూనే ఉండనివ్వండి. అది వాళ్ల నీచమైన మనస్తత్వం. డియర్ అనసూయ నువ్వు ధైర్యంగా నిలబడు. మేము నీకు అండగా ఉన్నాం. నీకు మరింత శక్తి చేకూరాలని కోరుకుంటున్నా” అని రాసుకొచ్చారు. 

ఏ బట్టలైనా వేస్కోండి: నాగబాబు 

శివాజీ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. “ఆడపిల్లలు ఎలా ఉండాలి.. ఎలాంటి దుస్తులు ధరించాలి.. ఏం మాట్లాడాలి అనే విషయాలపపై ప్రతిఒక్కరూ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తున్నారు. అలా కామెంట్స్ చేయడం రాజ్యాంగం ప్రకారం తప్పు. ఆడవాళ్లు ఇలాంటి డ్రెస్‌లే వేసుకోవాలని చెప్పటానికి మీకేం హక్కు ఉంది. ప్రతి ఆడపిల్లకు ఆత్మగౌరవం ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతూ ఉంటుంది. మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదు.

మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు వారి డ్రెస్సుల వల్ల కాదు.. మగవాళ్ల క్రూరత్వం వల్ల మాత్రమే. ప్రతి ఆడపిల్లను కుటుంబ సభ్యురాలిగానే చూడండి. మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకూ ఉంది. ఆడవాళ్లు ఎలాంటి దుస్తులైనా ధరించండి. బయటకు వెళ్లేటప్పుడు మీ రక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. నేను మగవాళ్లందరినీ తప్పు పట్టడంలేదు.. కొందరి గురించే చెప్తున్నా. ఆడవాళ్లను అవమానించినవారు బాగు పడినట్టు ఎక్కడా లేదు. మహిళలకు నాలాంటి వారు ఎప్పుడూ అండగా ఉంటారు. ఇలాంటి అంశంపై స్పందించటం ప్రతి ఒక్కరి బాధ్యత” అని చెప్పారు.