2 May, 2026 | 2:52 AM

ఎంపీహెచ్‌ఏ ఫలితాలు విడుదల చేయాలి

02-05-2026 02:01 AM

డిప్యూటీ సీఎం భట్టికి జేఏసీ నేతల వినతి

జగిత్యాల, మే 1( విజయక్రాంతి): ఎంపిహెచ్‌ఏ (మహిళా )సెకండ్ ఏఎన్‌ఎం రిక్రూట్మెంట్ తుది ఫలితాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో అభ్యర్థులు శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 2024లో సిబిటి పరీక్ష పూర్తయినా ఏడాది గడిచినా ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ వెయిటేజీ మార్కులపై హైకోర్టులో ఉన్న కేసులో ఇటీవల తీర్పు వెలువడిందని, ఆ తీర్పును తాము పూర్తిగా అంగీకరిస్తున్నామని తెలిపారు. దీనిపై మళ్లీ అప్పీల్ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది పదవీ విరమణ, పదోన్నతుల వల్ల ఏర్పడిన అదనపు ఖాళీలను కూడా ఈ రిక్రూట్మెంట్లోనే భర్తీ చేయాలని కోరారు.

తాము 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్నామని, వయస్సు మీరుతోందని, జాప్యం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వాపోయారు.తుది ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేసి, పర్మినెంట్ నియామకాలు చేపట్టాలని డిప్యూటీ సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, రామకృష్ణ, ఓఎస్డి పాక రమేష్, 2వ ఏఎన్‌ఎం ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పడాల మమత, సంఘం నాయకురాళ్లు కే.ధనలక్ష్మి,కవిత, తదితరులు పాల్గొన్నారు.