13 July, 2026 | 1:59 AM

ఎంఆర్‌ఎఫ్ డివిడెండు బొనంజా

04-05-2024 12:05 AM

షేరుకు రూ.194 ప్రకటించిన కంపెనీ

న్యూఢిల్లీ, మే 3: దేశంలో అత్యంత ఖరీదైన షేరు ఎంఆర్‌ఎఫ్ గత రెండు సందర్భాల్లో  కేవలం రూ.3 చొప్పున డివిడెండు చెల్లించి, సోషల్ మీడియాలో భారీఎత్తున మీమ్స్‌కు గురయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ కంపెనీ రూ.10 ముఖవిలువగల షేరుకు రూ.194 తుది డివిడెండు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.3 చొప్పున రెండు మధ్యంతర డివిడెండ్లు ఇవ్వడంతో కంపెనీ చెల్లిస్తున్న మొత్తం డివిడెండు రూ.200కు చేరుతుంది.

మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో ఎంఆర్‌ఎఫ్ కన్సాలిడేటెడ్ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే రూ.341 కోట్ల నుంచి 16 శాతం వృద్ధిచెంది రూ.396 కోట్లకు చేరింది. అయితే ఇది క్యూ3 నుంచి స్వీక్వెన్షియల్‌గా రూ.510 కోట్ల నుంచి 22 శాతం తగ్గింది. క్యూ4లో ఆదాయం 9 శాతం వృద్ధిచెంది రూ.5,842 కోట్ల నుంచి రూ. 6,349 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్‌ఈలో ఎంఆర్‌ఎఫ్ షేరు 4 శాతం క్షీణించి రూ. 1,28,500 వద్ద ముగిసింది.