ఆర్బీఐ రేట్ల కోత మరింత జాప్యం
ద్రవ్యోల్బణం రిస్క్ , యూఎస్ ఫెడ్ సంకేతాలు కారణం
బ్లూంబర్గ్ సర్వేలో నిపుణుల అంచనాలు
ముంబై, మే 2: ఈ ఏడాది తుది త్రైమాసికం వరకూ వడ్డీ రేట్ల తగ్గింపును రిజర్వ్ బ్యాంక్ వాయిదా వేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళన, యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రేట్లను ప్రస్తుత స్థాయిలోనే మరింతకాలం అట్టిపెడుతుందన్న సంకేతాలతో రిజర్వ్‌బ్యాంక్ రేట్ల కోతకు మరింత సమయం పడుతుందని తాజాగా బ్లూంబర్గ్ వార్తా సంస్థ సర్వేలో నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5 శాతంగా ఉన్నది. వాణిజ్య బ్యాంక్‌లకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటును రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఈ రేటు ఆధారంగానే బ్యాంక్‌లు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. కొద్ది నెలలు ఆగిన తర్వాత అక్టోబర్ త్రైమాసికంలో ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ల మేర (అరశాతం) తగ్గించవచ్చని తాజా బ్లూంబర్గ్ తాజా సర్వే లో నిపుణులు అంచనా వేశారు. వాస్తవానికి జూలై క్వార్టర్లో ఈ తగ్గింపు ఉండవచ్చని గత సర్వేలో అంచనా వేయగా, తాజా సర్వేలో నిపుణులు వారి అభిప్రాయా న్ని మార్చుకున్నారు.
ఫెడ్ తర్వాతే ఆర్బీఐ కోత
ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతను ప్రారంభించకుండా ఆర్బీఐ తగ్గించబోదని సర్వేలో మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరి త్రైమాసికం వరకూ ఫెడ్ తగ్గించకపోవచ్చని, లేదా 2024లో కోతలు ఉండకపోవచ్చని వారు భావిస్తున్నారు. రేట్లను ముందుగానే తగ్గిస్తే కరెన్సీలు మరింత క్షీణిస్తాయన్న ఆందోళన భారత్ వంటి వర్థమాన దేశాల్లో ఉన్నదని ఇటీవల మోర్గాన్ స్టాన్లీ వ్యాఖ్యానించింది. ఆసియాలో పలు కేంద్ర బ్యాంక్‌లు రేట్ల కోతను వాయిదా వేస్తాయని ఈ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అంచనాల్లో పేర్కొంది. ఈ ఏడాది రిజర్వ్‌బ్యాంక్ రేట్లను తగ్గించకపోవచ్చని డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్ ఎకానమిస్ట్ రాధికారావు చెప్పారు. భారత్ రేట్ల కోత 2025 ఏప్రిల్‌తో మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఉంటాయన్న అంచనాల్ని వెల్లడించారు. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణానికి ఉన్న రిస్క్‌లు, పటిష్టమైన ఆర్థికాభివృద్ధి, యూఎస్ రేట్ల కోతల్లో జాప్యం తదితర అంశాల కారణంగా ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరంలో యథాతథ స్థితినే ఆర్బీఐ కొనసాగిస్తుందని రాధికారావు విడుదల చేసిన తాజా నోట్‌లో వ్యాఖ్యానించారు.
6.3 శాతానికి జీడీపీ వృద్ధి
ఈ ఏడాది జనవరి త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి అంచనాల్ని బ్లూంబర్గ్ సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెంచారు. మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధిని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను మరింతగా పెంచాల్సిన అవసరం లేకపోయిన ప్పటికీ, తగ్గించడానికి సైతం తొందరపడాల్సిన పనిలేదని మలేషియా బ్యాంకింగ్ బీహెచ్‌డీ కరెన్సీ స్ట్రాటజిస్ట్ షావున్ లిమ్ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బాగున్నదని, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నదని ఆయన అన్నారు.
గ్లోబల్ పరిణామాలు కీలకం
భారత్ వృద్ధి, ద్రవ్యోల్బణం అంకెలు ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా జరిగే పరి ణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేంద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల నిర్ణయాల్ని ప్రభావితం చేస్తాయని ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎకాన మిస్ట్ అచాలా జెత్మలాని చెప్పారు. ధనిక దేశాల్లో ద్రవ్య విధానాలు.. ప్రత్యేకించి యూఎస్ ఫెడ్ నిర్ణయా లు దేశీయ రేట్ల అంశాన్ని సైతం నిర్దేశిస్తాయన్నారు. ఆర్బీఐ వరుసగా గత ఏడు ద్రవ్య సమీక్షా సమా వేశాల్లోనూ వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది. కేంద్ర బ్యాంక్ లక్ష్యమైన 4 శాతానికి ద్రవ్యోల్బణం దిగివచ్చేవరకూ రేట్ల తగ్గించేది లేదన్న సంకేతాల్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడిస్తున్నారు. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతంలోపునకు దిగివచ్చినప్పటికీ, దేశంలో ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు ఆహారోత్పత్తుల ధరల్ని పెంచే అవకాశం ఉన్నది. డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికం లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందన్న అంచనాల్ని తాజా బ్లూంబర్గ్ సర్వేలో విశ్లేషకులు వ్యక్తం చేశారు. పూర్తి సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.






