9 June, 2026 | 1:41 AM

మృగశిర కార్తె.. చేపల చెరువుల లూటీ!

09-06-2026 12:39 AM

చేపల కోసం మాంసాహారుల ఉరుకులు పరుగులు

మహబూబాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): మృగశిర కార్తె ప్రారంభం కావడంతో చేపల మార్కెట్లు, చెరువుల వద్ద సోమవారం విపరీతమైన సందడి నెలకొంది. సంప్రదాయంగా మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు భారీగా చేపల కొనుగోళ్లకు తరలివచ్చారు.

దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని చేపల చెరువులు, మార్కెట్లు వినియోగదారులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే చేపల చెరువుల వద్దకు చేరుకున్న వినియోగదారులు చేపల కొనుగోళ్ల కోసం పోటీపడ్డారు. సాధారణ రోజుల కంటే చేపల ధరలు పెరిగినా కొనుగోలుదారులు వెనక్కి తగ్గలేదు. రహు, గ్యాస్ కట్, బంగారు తీగ, బొచ్చతో పాటు స్థానికంగా లభించే చేపలకు మంచి డిమాండ్ కనిపించింది. చేపల చెరువుల నిర్వాహకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున చేపల వేట చేపట్టారు.

కొన్ని ప్రాంతాల్లో చెరువులను పూర్తిగా ఖాళీ చేసి చేపలను మార్కెట్లకు తరలించారు. డిమాండ్ పెరగడంతో వ్యాపారులు చెరువుల వద్ద నుంచే చేపలను కొనుగోలు చేసి పట్టణాలకు తరలించారు. మృగశిర కార్తె సందర్భంగా చేపల విక్రయాలు గణనీయంగా పెరగడంతో మత్స్యకా రులు, చేపల పెంపకందారులకు మంచి ఆ దాయం లభించింది. మరోవైపు చేపల కో సం ప్రజలు బారులు తీరడంతో మార్కెట్లు రద్దీగా మారాయి.

కొన్ని చోట్ల మృగశిర కార్తె సందర్భంగా చేపల కోసం మాంసాహారులు ఉరుకుల పరుగులు పెట్టగా, చేపల చెరువులు, మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయి పండుగ వాతావరణాన్ని తలపించాయి. చెరువుల్లో చేపలు పట్టుకోవడానికి మత్స్యకారులకు ఇదే చివరి అవకాశం కావడంతో, మత్స్యకారులు చేపలు పట్టుకున్న తర్వాత మిగిలిపోయిన చేపలను సేకరించేందుకు ప్రజలు వందల సంఖ్యలో చెరువుల్లోకి దిగడంతో చాలా చెరువులు జనంతో సందడిగా మారాయి.