18-02-2026 07:24:21 PM
తక్షణమే మూడు బోర్లు వెయ్యాలి
నీటి సరఫరాపై నిర్లక్ష్యం చేస్తే చర్యలే
మున్సిపల్ చైర్‌పర్సన్ మాణిక్య ఉమారాణి శ్రీనివాస్
బుర్ర మత్తడి ఫిల్టర్ బెడ్లను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు
అధికారులకు కీలక ఆదేశాలు జారీ
కామారెడ్డి,(విజయక్రాంతి): వేసవిలో పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి రానివ్వమని మున్సిపల్ చైర్ పర్సన్ మాణిక్య ఉమారాణి అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని బుర్ర మత్తడి, పెద్ద చెరువు వద్దగల ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె అధికారులతో మాట్లాడారు. తక్షణమే మూడు బోర్లు తవ్వించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్‌పర్సన్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సూచన మేరకు బుధవారం ఆమె పట్టణంలోని బుర్ర మత్తడి ఫిల్టర్ బెడ్లను మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు.ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుర్ర మత్తడి వద్ద ప్రస్తుతం ఉన్న వనరులకు అదనంగా మరో మూడు కొత్త బోర్లు వేయించాలని, నీటికి అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా ఫిల్టర్ బెడ్ల వద్ద పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని సూచించారు. ప్రతి ఇంటికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. వేసవి ప్రణాళికలో ఏవైనా లోపాలు ఉంటే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఏఈ వేణు ప్రసాద్‌లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు పలువురు అన్వర్, కాల్ల గణేష్, భాస్కర్ గౌడ్, గడ్డమీది మహేష్, అంజద్, లడ్డు, భూపతి, గంగాధర్, వాజిద్, లోలం శ్రీనివాస్, జెర్సీ నర్సింహులు, మామిండ్ల లక్ష్మణ్, కె. లలిత, బబ్లు, మాజీద్, జావేద్, యూనుస్, సిద్దిఖ్, గ్యార సాయిలు, మన్సూర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.