09-02-2026 01:56:30 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): తెలంగాణలో మున్సిపల్, కార్పొరే షన్ ఎన్నికల్లో బీజేపీ హోరు స్పష్టంగా కన్పిస్తోందని, విశేష స్పందన వస్తోందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభా ష్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, ఈ ప్రజాధరణను అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్‌తో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో రాజకీయంగా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే అధోగతేనని ఆయన పేర్కొన్నారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులపై ప్రజాగ్రహం పెరిగిందని, మల్లన్నసాగర్‌లో ప్రచారానికి వెళ్లిన మాజీమంత్రి హరీశ్‌రావుపై చెప్పులతో దాడి చేసిన ఘటనే అందుకు నిదర్శనమన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఏం చేస్తుందో తాము ప్రజలకు వివరించామని, మేనిఫెస్టోను ముందే ప్రకటించి అభివృద్ధి ప్రణాళికను వెల్లడించామని, కానీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు గతంలో ఏం చేశారు, గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా, కేవలం తప్పుడు ప్రచా రం, కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆధారాలు కాలిపోవడం న్యాయవ్యవస్థను బలహీనపర్చడమేనని, నేరస్తులకు రక్షణ కల్పించడమేనని, బీఆర్‌ఎస్ -కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై అవినీతి ఆధారాలను మాయం చేస్తున్నాయని, వీటన్నిటికీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం, మంటలు చెలరేగడం వెనుక లోతైన కుట్ర కోణం ఉందని అనుమానాలు బలపడుతున్నాయన్నారు.
గత 52 సంవత్సరాలలో ఇలాంటి ప్రమాదం జరగలేదు, కాబట్టి దీనిని కేవలం సాదాసీదా ప్రమాదమనలేమన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి వాయిస్ టెస్ట్ రిపోర్టులు, కీలక ఫోన్ సంభాషణల రికార్డులు, సుప్రీంకోర్టు విచారణకు కీలకమైన ఆధారాలు.. ఇవీ అగ్నిప్రమాదంలో బూడిదయ్యాయా? కోర్టు విచారణ దగ్గరపడుతున్న సమీపంలోనే ఈ ప్రమాదం జరగడం యాదృచ్ఛికమని ఎలా చెప్పాలి? అని ప్రశ్నించారు.
ఫోన్‌ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు కూడా ఇదే ల్యాబ్‌లో ఉన్నాయని, ఆ ఆధారాలు, ఫైళ్లు బూడిదైతే, బీఎఆర్‌ఎస్- కాంగ్రెస్ పార్టీలకే లాభమన్నారు. కోర్టుల్లో అగ్నిప్రమాదా న్ని ఒక కారణంగా చూపెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. గతంలో రేవంత్‌రెడ్డి ఓటుకు నోటుకేసులో రక్షణ పొందినందుకు, ఇప్పుడు గురుదక్షిణగా ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబాన్ని రక్షించే ందుకు యత్నిస్తున్నారని విమర్శించారు.