2 July, 2026 | 4:30 AM

మొక్కుబడిగా మున్సిపల్ సమావేశాలు

02-07-2026 02:21 AM
  1. పోరు జెండా లేదు.. ‘జెండా’ ఒకటేనా..?
  2. మూగబోయిన విపక్షం గొంతు... ఆమోదాలతో సరి

బెల్లంపల్లి, జూలై 1 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపాలక సంఘం సమావేశాలు రొటీన్ గా మారాయి. ప్రతి సమావేశంలో ఎజెండా ఉన్నప్పటికీ అధికార పక్షం, విపక్షం అంటూ ఏమి లేకుండా అందరూ ఒకే జెండా కిందకి చేరిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెల నిర్వహించే సర్వసభ్య సమావేశం ఒక అంకంగా సాగుతుంది. అందులో భాగంగానే బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి అధ్యక్షతన ప్రతి నెలా నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశాల్లో ఎజెండా అంశాలు పెద్దగా చర్చకు రావడం లేదు. అందరు ఆమోదించే అంశాలుగానే కనిపిస్తున్నాయి. సాధారణంగా విపక్షాలు ఎజెండా అంశాల మీద చర్చిస్తారు. అధికారులను నిలదీస్తారు. ప్రజాభివృద్ధి పనులపై గళం విప్పుతారు. కానీ బెల్లంపల్లి మున్సిపల్ సమావేశంలో అందుకు భిన్నమైన పాత్ర పోషిస్తుంది. కౌన్సిల్ సమావేశంలో విపక్ష స్వరం మూగబోయినట్టు కనిపిస్తుంది. విపక్షం అధికార పక్షానికి వంత పాడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యులు సరి సమంగానే ప్రాతినిధ్యాన్ని కైవసం చేసుకున్నారు. 34 వార్డులల్లో కాంగ్రెస్ 14 , బీఆర్‌ఎస్ 14 స్థానాలను సొంతం చేసుకున్నాయి. ఐదుగురు ఇండిపెండెన్స్ గెలుపొందగా వీరి మద్దతుతో మున్సిపల్ అధికార పీఠాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మున్సిపల్ చైర్ పర్సన్ గా దావ స్వాతి, వైస్ చైర్మన్ గా రాగంశెట్టి సతీష్ ఎన్నికయ్యారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ కు చెందిన వారే కావడం గమనార్హం.

ఇలా బలాబలాల రీత్యా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మున్సిపల్ పాలకవర్గంలో సమవుజ్జిగా నిలిచాయి. బీఆర్‌ఎస్ కు చెందిన 14 మంది సభ్యులు అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే సామర్థ్యం ఉంది. కానీ ఏ ఒక్క సమావేశంలో కూడా విపక్షం అధికార పక్షాన్ని ప్రశ్నించిన పాపాన పోలేదు. అధికార పక్షం పరిపాలన తీరుపై ప్రతిపక్షం గట్టిగా పోరాటం చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ రెండు పక్షాలు కలిసి కాలం వెలదీస్తున్నట్లుగా కనిపిస్తోంది.

సమావేశం ఎజెండాలో పొందుపరిచిన అంశాల ఆమోదం కోసమే నిర్వహిస్తుంటారు. అయితే అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు అంశాలపై విపక్ష సభ్యులతో చర్చించకుండానే ఆమోదాలు, తీర్మానాలకి ఓకే అంటున్నారని విపక్ష సభ్యుల తీరుపై ప్రజలు చర్చించుకుంటున్నారు. 14 మంది బీఆర్‌ఎస్ సభ్యులు ప్రతిపక్షంలో ఉన్న సంగతి మరిచిపోయినట్టుగా ఉన్నారు. ఇప్పటికైనా జనరల్ బాడీ సమావేశాల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధిపై గళం ఎత్తుతారో లేదా ఇలాగే మూగనోము పాటిస్తారా..? అనేది వచ్చే సమావేశంలో తెలుస్తోంది.