22 April, 2026 | 3:13 AM

మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొనాలి

24-06-2025 10:12 PM

సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు..

పెద్దపల్లి (విజయక్రాంతి): జులై 9 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని ముద్రించిన కరపత్రాలను మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు(CITU District Secretary Eravelli Mutyam Rao) మాట్లాడుతూ... కార్మికులకు నష్టం చేస్తూ, యజమానులకు లాభం చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులందరికీ నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్స్ తో జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.

ఈ సమ్మెలో జిల్లాలోని మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు, కేంద్ర ప్రభుత్వం తెచ్చే నాలుగు లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే ప్రస్తుతం 8 గంటల పని విధానం 12 గంటలుగా మారుతుందని, సమ్మె హక్కు నిర్వీర్యం అవుతుందని, ఇప్పటివరకు కార్మికులకు అందుతున్న పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, సెలవులు లాంటి సంక్షేమ చర్యలన్నీ ఆపివేస్తారని అసలు కార్మిక సంఘాలు పెట్టుకునే అవకాశాన్ని లేకుండా ఈ లేబర్ కోడ్స్ లో పొందుపరిచారని అందుకే కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే ఈ నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సావణ పెళ్లి వెంకటస్వామి, నాయకులు బొంకూరి సాగర్, కుక్క అన్వేష్, చింతల మరియా, సలిగంటి సుశీల, బొంకూరి శంకర్, మద్దెల రాజయ్య, కాలవల కొండయ్య  తదితరులు పాల్గొన్నారు.