16 April, 2026 | 3:50 PM

నగల కోసం హత్య

10-06-2025 12:48 AM

రాజేంద్రనగర్, జూన్ 9 : వృద్ధురాలి మిస్సింగ్ మిస్టరీని పోలీసులు చేదించారు. ఆమె హత్యకు గురైనట్లు విచారణలో తేలింది. ఓ మహిళ ఆమెకు మాయమాటలు చెప్పి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి చంపేసి ఒంటిపై ఉన్న నగలతో ఉడాయించింది. ఈనెల 3న  నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన వృద్ధురాలి మిస్సింగ్ కేసును చేదించి నిందితురాలిని రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణా రెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు.

వివరాలు..3 వ తేదీ ఉదయం 05:30 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో  నివసించే ఆర్. బాలమ్మ (75) వాకింగ్ కోసం వెళ్లి అదృశ్యమైంది. పొరుగు ఇంటికి చెందిన అనిత పై అనుమానం వ్యక్తంచేస్తూ బాలమ్మ కోడలు రామేశ్వరం లక్ష్మి మరుసటి రోజు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.అప్పటికే కనిపించకుండా పోయిన  అనితను 07వ తేదీన పట్టుకుని విచారించారు.

అనిత ఏడాది క్రితం తన సొంతస్థలం వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు గ్రామం నుంచి ఏడాది క్రితం ఖానాపూర్ కు వలస వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు.పక్కా ప్లాన్ ప్రకారం ఆమె బాలమ్మకు మాయమాటలు చెప్పి ఆమెను ట్రాప్ చేసింది.

ఆమెను చంపి ఒంటిపై ఉన్న నగలను తీసుకోవాలని ఉద్దేశంతో మూడవ తేదీ ఉదయం 5 గంటలకు బాలమ్మకు మాయమాటలు చెప్పి తనతో పాటు వికారాబాద్ జిల్లా కండ్లపల్లి ఫారెస్ట్ లోకి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బాలమ్మను చంపి ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, బంగారు గుండ్లు, వెండి కడియాలు, వెండి పట్టిలు తీసుకొని మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయింది.

ఘటనా స్థలం కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని నార్సింగి పోలీసులు గుర్తించి పూడూరు తాసిల్దార్ ను కలిసి జరిగిన విషయం తెలిపారు. అప్పటికే పూడూరు పోలీసులు పూర్తిగా కూలిపోయిన మృతదేహాన్ని గుర్తించి అక్కడే ఖననం చేశారు. అనంతరం నార్సింగి పోలీసుల విజ్ఞప్తి మేరకు 5వ తేదీ మృతదేహాన్ని వెలికి తీయించగా కుటుంబ సభ్యులు ఆమెను గుర్తించారు.

అనిత బాలమ్మను చంపినట్లు నిర్ధారించారు. అనిత నుంచి సుమారు మూడు తులాల బంగారు, 57 తులాల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని  రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి సోమవారంతెలిపారు.