12-11-2025 12:00:00 AM
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు గుర్తించి పట్టుకున్న పోలీసులు
కేసు చేదించిన పోలీసులకు రివార్డ్ హత్య వివరాలు వెల్లడించిన ఎస్పీ
ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసై, చేసిన అప్పులు కట్టలేక అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఓ వ్యక్తి ఓ మహిళను హత్య చేసి, బంగారు పుస్తెలతాడు, ఆభరణాలు, పట్టీలు, కడాలు, ఎత్తు కెళ్లిన కేసులో ప్రధాన నిందుతుడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి నుంచి రూ.2,35,000, ఒక వాహనం, ఐపోన్ స్వాధీనం చేసుకున్నారు.
గద్వాలటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శేరెల్లివీధిలో బలిజ లక్ష్మీ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ టి.శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అప్పు ఇవ్వాలని ఒత్తిడి...
శేరెల్లివీదిలో నివసిస్తున్న బలిజ లక్ష్మీ, మల్లికార్జున గౌడలు చిరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ధరూర్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన కల్లా శ్రీనివాస్ రెడ్డి గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో కమీషన్ మర్చంట్ గా నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కల్లా రాంరెడ్డి షేరెల్లి వీదిలో గల తన పెద్దనాన్న ఇంట్లో నివాసముంటున్న బలిజ లక్ష్మీతో పరిచయం ఏర్పడింది.
రాంరెడ్డి బెట్టింగ్ అలవాటు పడి తన భార్య బంగారం ఆభరణాలు తీసుకుని ఆన్ లైన్ గేమ్ లు ఆడి అప్పుల పాలయ్యాడు. ఇదే క్రమంలో వడ్డీల వ్యాపారం నిర్వహిస్తున్న బలిజ లక్ష్మీ ని కొంత డబ్బులు అప్పు ఇవ్వమని ఒత్తిడి తీసుకవచ్చాడు. ఈనెల 2న ఆదివారం లక్ష్మీ ఇంటికి వెళ్లి మరోసారి అప్పు ఇవ్వాలని కోరాడు. తన దగ్గర డబ్బులు లేవని, ఇవ్వలేని చెప్పడంతో లక్ష్మీని పథకం ప్రకారం వెనుకకు నెట్టి గొంతు నులిమి హత్య చేశాడు.
ఆమె మృతి చెందినట్లు నిర్దారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. కొద్ది సేపటికి మృతురాలి భర్త మల్లికార్జున్ ఇంటికి రాగ తలుపు తెరిచి ఉండటాని గమనించి తన భార్య మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు, బంగారం కోసమే హత్య చేసిఉంటారని బాధితుడు గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు గుర్తింపు
మృతురాలి భర్త మల్లికార్జున్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు గద్వాల డీఎస్పి వై.మొగులయ్య పర్యవేక్షణలో గద్వాల సీఐ టి.శ్రీను ఆధ్వర్యంలో గద్వాల టౌన్ ఎస్‌ఐ కళ్యాణ్ కుమార్, గద్వాల రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్, మల్దకల్ ఎస్‌ఐ నందీకర్, పోలీస్ సిబ్బంది మృతురాలి లక్ష్మీతో సంబందాలున్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని విచారించారు.
ఈ క్రమంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రామిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. మృతురాలు ఇంటికి మరియు మృతురాలి భర్త యొక్క షాప్ దగ్గరకు వెళ్ళి నట్లు సిసిటివి ఫూటేజ్ ఆదారంగా నిర్ధారణ కాగా, నేరస్తుడే నేరం చేసి మృతురాలిని డబ్బులు అడిగినట్లు, మృతురాలి ఇంటిలోకి వెళ్లి వచ్చినట్లు దర్యాప్తులో తేలింది.
దొంగిలించన పుస్తెలతాడు బంగారు బిస్కెట్ గా మార్చి
మృతురాలి హత్య చేసి ఆమె బంగారు పుస్తెలతాడు, పట్టీలు, కడాలు దొంగిలించిన నిందితుడి తన చిన్ననాటి స్నేహితుడైన ఉమేష్ కు సంబంధించిన శంషాబాద్ లో గోల్ షాప్ లో కరిగించి బిస్కెట్ గా మార్పించాడు. ఆ బిస్కెట్ బంగారాన్ని హైదరాబాద్ లోని ఉప్పరగూడలో ఓ గోల్ దుకాణంలో విక్రయించగా రూ.5 లక్షల 60 వేలు వచ్చాయి.
వచ్చిన డబ్బులో కొంత డబ్బును తన ఖర్చులకు వాడుకొని భార్యకు ఇయర్ రింగ్స్ చేయించి, కొత్త బట్టలు తీసుకున్నాడు. మిగిలిన 1.33 లక్షల రూపాయలను తన స్కూటీలో పెట్టుకున్నాడు. తన ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న లక్ష ఇరవై వేల రూపాయలను అప్పు కట్టేశాడు. తాకట్టులో ఉన్న తన భార్య బంగారాన్ని విడిపించేందుకు 1.65 లక్షలు కట్టాడు.
కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు : ఎస్పీ
ఎలాంటి ఆధారాలు లభించలేని మర్డర్ కేసును ఛేదించడంలో కృషి చేసిన గద్వాల సర్కిల్ పోలీసులను జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస్ రావు అభినందించారు. ఈ సందర్భంగా ఈ కేసును ఛేదించడం లో ప్రతిభ చూపిన పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్ కుమార్, గద్వాల్ టౌన్ ఎస్‌ఐ -2 సతీష్ రెడ్డి, గద్వాల రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్, మల్దకల్ ఎస్‌ఐ నందీకర్, ధరూర్ శ్రీహరి, కానిస్టేబుల్ చంద్రయ్య, కిరణ్, రామకృష్ణ, వీరేశ్ లకు రివార్డులు ఇచ్చి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినధించారు.