మూసీ డీపీఆర్ రెడీ
మొదటి దశకు.. అంచనా వ్యయం 6,500 కోట్ల నుంచి 7 వేల కోట్లు
- ప్రభావితమయ్యే నిర్మాణాలు: 1,435
- బఫర్ జోన్‌లో ఉన్నవారికి టీడీఆర్ ఇస్తాం
- డిసెంబర్ 2024లోనే డీపీఆర్ తయారీ ప్రారంభం
- గత ప్రభుత్వ జీవో ప్రకారమే బఫర్ జోన్: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
- మూసీ ప్రక్షాళనను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందా?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- లక్షన్నర కోట్లకు పెంచడం వెనుక ఉద్దేశం ఏమిటో?: కేటీఆర్
- ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎస్ అసెంబ్లీ నుంచి వాకౌట్
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి) : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి ఫేజ్ డీపీఆర్ సిద్ధమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బఫ ర్‌జోన్ విషయంలో గత ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన జీవోను అనుసరిస్తున్నామని గుర్తుచేశారు. నదికి ఇరువైపుల 50 మీటర్ల బఫర్ జోన్ నిర్ణయం గత ప్రభుత్వమే తీసుకున్నదని, మేము కొత్తగా బఫర్ జోన్‌ను నిర్ణయించలేదన్నారు. డీపీఆర్ తయారీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలను మంత్రి శ్రీధర్‌బాబు ఖండించారు.
కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు డీపీఆర్ రెండు నెలల్లో పూర్తి కాలేదని, 2024 డిసెంబర్‌లో మెయిన్ హార్ట్ సంస్థకు బాధ్యతలు అప్పగించగా, 2026 ఫిబ్రవరిలో ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలిపారు. అంటే శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నివేదిక సిద్ధమైందని వివరించారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పునరుజ్జీవంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మూసీ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ.. మొదటి దశ అంచనా వ్యయం రూ. 6,500 నుంచి రూ. 7,000 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. మూసీ పునర్నిర్మాణంలో భాగంగా ప్రాథమి కంగా 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశం ఉం దని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన తుది ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ‘బఫర్ జోన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం తరపున టీడీఆర్ ఇస్తామని, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే బాధితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నాయకులు మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో బురదజల్లుతున్నారని మండిపడ్డారు. తాము చేపట్టే ప్రతి పనిని ప్రజల ముందు పెడుతున్నామని, ఇందులో దాపరికాలేవీ లేవన్నారు. మూసీ కాలుష్యం జంట నగరాలకు సంబంధించిన ప్రధాన సమస్య అని, దీనిని పరిష్కరించేందుకు తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ సంకుచిత ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టారు.
గతంలో బఫర్‌జోన్‌కు సంబంధించిన జీవో ఇచ్చిన ఇప్పుడేమో ఇళ్లు ఎలా కూలగొడతారని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల మేలు గురించి అవసరం లేదని, తాము ఏం సంకల్పం మొదలుపెట్టినా అ భాండాలు వేయడం అలవాటు అయింద ని విమర్శించారు. అందుకే రాజకీయ ఆరోప ణలకే బీఆర్‌ఎస్ ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
బీఆర్‌ఎస్ వైఖరి మార్చుకోవాలి..
ఏడీబీ బ్యాంకు ప్రతినిధులు ఇప్పటికే మూడుసార్లు ప్రాజెక్టును సందర్శించారని, వారు ప్రాథమికంగా సంతృప్తి చెందారని తెలిపారు. వచ్చే బోర్డు మీటింగ్ వరకు ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల మంజూరుపై ఏడీబీ అప్రూవల్ వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ బ్యాంకులో కాకుంటే వేరే మార్గాల్లో ప్రయత్నిద్దామని, వరల్డ్ బ్యాంకు, పీపీపీ వంటి దిశగా అన్వేషణలో ఉన్నామని స్పష్టం చేశారు.
మూసీ ప్రాజెక్టు డీపీఆర్ రూపొందించిన మెయిన్ హార్ట్ అనే సింగపూర్ సంస్థకు ఇలాంటి పనుల్లో అనుభవం ఉందని, భారతదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ అనేక ప్రాజెక్టులు చేసిందన్నారు. ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం నిషేధించలేదని, బ్లాక్ లిస్టులో పెట్టిందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ఆపేసిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మేము ఏ ప్రాజెక్టును నిలిపివేయలేదని తెలిపారు.
గత ప్రభుత్వంలో 32 ఎస్టీపీలను ప్రతిపాదించి 20 ఎస్టీపీలు మాత్రమే ప్రారంభించారని, కానీ వాటిలో కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మిగిలిన 70 శాతం పనులను పూర్తి చేశామని స్పష్టం చేశారు. మూసీని జీవనదిగా అభివృద్ధి చేస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో మార్పు చూపిస్తామని చెప్పాం.. అదే లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు.
కానీ ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ ప్రతిపక్ష పార్టీ అడ్డుపడుతున్నదని, ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నాయకులు వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. మూసీని ప్రక్షాళన పట్ల బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి లేదని, హైదరాబాద్‌కు తాగునీరు, నల్లగొండకు సాగునీరు అందించాలనే ఉద్దేశమే లేదని విమర్శించారు. అవసరమైతే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ పెట్టేందుకైనా సిద్ధమని చెప్పారు.




