రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
- పండించిన పంటకు గిట్టుబాటు ధర
- మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం
- పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- చేవెళ్లలో అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు
చేవెళ/శంకర్‌పల్లి, జూలై 6 (విజయక్రాంతి): పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సమాచార సాంకేతిక, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని బీడీఎల్ జంక్షన్ వద్ద రూ.75 లక్షల నగర అభివృద్ధి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఈర్లపల్లి, చేవెళ్ల, అంగడి బజార్, పామిన గేటు నుంచి గ్రామం వరకు బీటీ రోడ్డు, కుమ్మేర గేట్ వద్ద నిర్మించిన ఖమాన్, బస్ షల్టర్‌ను ప్రారంభించారు. షాబాద్ మండలం సర్దార్ నగర్ మార్కెట్ యార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం షాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నాగర్‌గూడలో నిర్వహించిన రైతుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంత రైతులు పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రానికి విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. పంటలకు గిట్టుబాటు ధర లభించేలా ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వ్యవసాయ మార్కెట్ నిర్మాణం చేపట్టడం రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమల స్థాపనతో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ప్రాధాన్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
చందనవెల్లి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రైతుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని, భూసేకరణ అంశాల్లో రైతుల ప్రయోజనాలు పరిరక్షించేలా జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్మయి, శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్ సమతా వెంకట్ రెడ్డి, వైస్ చైర్పర్సన్ కాసుల రాములు గౌడ్, కౌన్సిలర్లు, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాపరెడ్డి, షాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.






