9 June, 2026 | 2:45 AM

ప్రజలకు జవాబుదారీగా పని చేయాలి

09-06-2026 01:27 AM

డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు తీసుకురావాలి

ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరి కిరణ్

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖలో సేవా భావంతో పనిచేస్తూ ప్రజలకు జవాబుదారిగా ఉండాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. హిమాయత్ సాగర్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 29 మంది ఏఈఎస్‌లు, 92 మంది ఎస్‌ఐలకు సోమవారం ఎక్సైజ్ శాఖపై కమిషనర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే డిపార్ట్‌మెంట్‌ల్లో ఎక్సైజ్ శాఖ ముఖ్యమైందని, ఎక్సైజ్ చట్టాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని సూచించారు. నిత్యం చట్టాలపై ఇతర అంశాలపై తెలుసుకుంటూ ఉద్యోగంలో ముందుకు సాగాలని.. అప్పుడే డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు వస్తుందని ఆయన పేర్కొన్నారు. శిక్షణలో సాధించిన నైపుణ్యత, నిత్యం పఠనం ద్వారా తెలుసుకున్న విషయాలతో ఉద్యోగంలో విజయాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.

ఎక్సైజ్ శాఖకి కీలకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ బ్రేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పనితీరు ఎలా ఉంటుంది.. ఎలా మద్యం అమ్మకాలు జరుగుతాయి అనే విషయంపై వారికి కమిషనర్ వివరించారు. తెలంగాణలో ఏ ఫోర్ షాపులు( మద్యం షాపులు), బార్లు ఎలా పనిచేస్తాయి అనే విషయంపై కూడా కమిషనర్ వివరించారు.

తొలుత శిక్షణార్థులతో శిక్షణలో ఎలాంటి నైపుణ్యాన్ని సాధించారని అడిగి తెలుసుకున్నారు. వారిని ప్రశ్నలు అడిగి, క్విజ్ నిర్వహించారు. శిక్షణ పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అకాడమీలో ఈనెల 11 తో శిక్షణ పూర్తి చేసు కోనున్నారు. ఏఈఎస్‌లకు ఎస్‌ఐలకు వివిధ జిల్లాల్లో ఫీల్డ్ ట్రైనింగ్  తీసుకోవడానికి వెళ్లనున్నారు. వీరికి స్థానిక జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలకు పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించి ఎంపిక చేశారు. సమావేశంలో ఎక్సైజ్ అకాడమీ సెయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, ఈఎస్ అంజి రెడ్డిలు ఉన్నారు.