11-02-2026 03:32:34 AM
రఘనాథపాలెం/ఖమ్మం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా తన ఫోన్ ట్యాప్ అవుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకున్నదని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ఖమ్మంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్యాపింగ్ కో సం ఎక్కడెక్కడ పరికరాలు అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తోందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగు తోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తోంది. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది‘ అని మంత్రి స్పష్టం చేశారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.