11-02-2026 03:32:05 AM
రంగనాథ్ను కలిసిన కాలనీ అసోసియేషన్
ఆక్రమణల నిరోధానికి పూర్తి సహకారం
మణికొండ, ఫిబ్రవరి 10, ( విజయక్రాంతి) : ప్రజల బాగు కోసం కేటాయించిన బహిరంగ స్థలాలను ఆక్రమణల నుండి కాపాడటంలో హైడ్రా చూపిస్తున్న చొరవ అభినందనీయమని శ్రీ వెంకటేశ్వర రెసిడెన్షియల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతిని ధులు పేర్కొన్నారు. మంగళవారం నెక్నంపూర్ డివిజన్ పరిధిలోని కాలనీ సభ్యులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు రూ. 30 కోట్ల విలువైన 1250 గజాల పార్కు స్థలం, 800 గజాల కమిటీ హాల్ స్థలంతో పాటు 600 గజాల సెప్టిక్ ట్యాంకు స్థలం ఆక్రమణలకు గురికాకుండా ఉండటంలో రంగనాథ్ అందించిన పూర్తి స్థాయి సహాయ సహకారాలు మరువలేనివని కొనియాడారు.ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటానికి హైడ్రా అండగా నిలవడమే కాకుండా, భూ కబ్జాదారుల నుండి ఈ స్థలాలను విముక్తి చేయడంలో కీలక పాత్ర పోషించిందని వారు గుర్తు చేశారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ను కోరారు. రంగనాథ్ను కలిసిన వారిలో కాలనీ ప్రతినిధులు పద్మ, శ్రీనివాసన్, శేషేంద్ర, శివ, హైదర్ అలీ, నరసింహారెడ్డి, నితీష్, ఘౌస్, వసంత్, గోపాల్, ఆరిఫ్, సుజాత, సీత, లావణ్య, ఉష, విజయలక్ష్మి, సుప్రియా, పారిజాత, జ్ఞానేశ్వరి తదితరులు ఉన్నారు.