23 May, 2026 | 2:39 AM

మంచినీళ్లబండలో మిస్టరీ మర్డర్!

23-05-2026 01:04 AM

దోపిడీ డ్రామా వెనుక కుట్ర కోణం?

  15 గంటల్లోనే కీలక లీడ్స్ పట్టుకున్న పోలీసులు

హుస్నాబాద్, మే22: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మంచినీళ్లబండ గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసు గంట గంటకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తొలుత ఇది సాధారణ దోపిడీ హత్యగా కనిపించినా.. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఘటన వెనుక పక్కా ప్రణాళిక, పరిచయస్తుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

భీమదేవరపల్లి,ములుకనూర్ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళను దుండగులు అత్యంత దారుణంగా హత్య చేయడం గ్రామంలో భయాందోళనలు రేపింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటనలో మెడలోని పుస్తెలతాడు, చెవి దిద్దులు తెంపుకెళ్లడం ద్వారా దోపిడీ కోణం సృష్టించే ప్రయత్నం జరిగిందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజ్యలక్ష్మి తలపై బలమైన ఇనుప వస్తువుతో దాడి చేసిన ఆనవాళ్లు లభించగా, ఒక చెవి పూర్తిగా చీలిపోయేలా దాడి జరిగినట్లు సమాచారం. దుండగుల లక్ష్యం కేవలం బంగారం కాదని, ముందుగానే హత్యకు స్కెచ్ వేసి వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో కీలక మలుపుగా మారింది గురువారం రాత్రి జరిగిన ఒక ఫోన్ కాల్. కనకయ్య రెండో భార్య రాధ, కేశవాపూర్ గ్రామంలోని ఓ డాక్టర్కు ఫోన్ చేయాలని చెప్పి సమీప మహిళ వద్ద నుంచి ఫోన్ తీసుకోవడం ఇప్పుడు పోలీసుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ కాల్ నిజంగానే డాక్టర్కే వెళ్లిందా..? లేక మరెవరితోనైనా మాట్లాడిందా..? అనే కోణంలో పోలీసులు కాల్ డేటా, మొబైల్ వివరాలను విశ్లేషిస్తున్నారు. సంఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ స్వయంగా గ్రామానికి చేరుకొని దర్యాప్తును సమీక్షించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్స్ ఆధారాల కోసం ఇంటి పరిసరాలను జల్లెడ పట్టాయి. హుస్నాబాద్ ఏసీపీ సదానందం నేతృత్వంలో సీఐ కె. శ్రీనివాస్, ఎస్‌ఐలు పాకాల లక్ష్మారెడ్డి, చాతరాజు ప్రశాంత్, పుల్ల అభిలాష్ ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారు.

ఘటన జరిగిన 15 గంటల్లోనే పోలీసులు కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు సంకేతాలు లభించినట్లు తెలుస్తోంది. కుటుంబ అంతర్గత విభేదాలు, పాత మనస్పర్థలు, ఆస్తి వ్యవహారాలు వంటి కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గ్రామస్థుల సమాచారం ప్రకారం, కనకయ్యకు ఇద్దరు భార్యలు ఉండటం, కుటుంబ పరిస్థితులు కూడా కేసులో కీలకాంశాలుగా మారాయి. రాజ్యలక్ష్మి హత్య వెనుక అత్యంత సమీప బంధువుల పాత్ర ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే పోలీసుల చేతికి కొన్ని కీలక ఆధారాలు చిక్కినట్లు సమాచారం. మరికొద్ది గంటల్లోనే ఈ సంచలన హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను హుస్నాబాద్ పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశముంది.