23 May, 2026 | 2:37 AM

టాడిఎంఎఫ్‌ను నిలిపేయాలి

23-05-2026 01:02 AM

గీతవృత్తి జోలికొస్తే సహించం బాలగోని హెచ్చరిక 

ముషీరాబాద్, మే 22 (విజయక్రాంతి): టాడి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో గీతవృత్తిపై కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ గౌడ్ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటి చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే దీన్ని నిలిపివేయాలని, తమ వృత్తిని కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాలరాజ్‌గౌడ్ మాట్లాడుతూ.. కల్లుగీత వృత్తి పై కార్పొరేట్ శక్తులు కన్ను వేశాయన్నారు. గీతవృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గౌడ కులానికి సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు స్పందించి గౌడవృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన సమన్వయ కమిటీ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా వృత్తిపరమైన దాడులు జరుగుతున్నాయని అన్నారు.

గౌడకుల వృత్తిని ధ్వంసం చేయాలని చూస్తే సహించేది లేదని పేర్కొన్నారు. ఐక్య సాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ మాట్లాడుతూ తమ కుల వృత్తిలో జోక్యం చేసుకోవద్దని టాడి మ్యూజికల్ ఫెస్టివల్‌ను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటి నాయకులు ఎస్. దుర్గయ్య గౌడ్, గడ్డమీది విజయకుమార్ గౌడ్, ముద్దగోని రాంమోహన్ గౌడ్, బైరు శేఖర్, ఆనంద్ గౌడ్, జంగంరావు గౌడ్, సత్యం గౌడ్, రేవతి గౌడ్, దేశగాని సాంబశివ గౌడ్, ఐలన్ గౌడ్, బొమ్మగాని నాగభూషణం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.