23 May, 2026 | 1:52 AM

ఆక్రమణలో అటవీ భూమి

23-05-2026 01:05 AM
  1. రాత్రికి రాత్రే కంటైనర్ ఏర్పాటు
  2. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

చేగుంట, మే 22 : మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివారులో అటవీ శాఖ భూమిని అక్రమంగా ఆక్రమించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గ్రామ శివారులో ఉన్న చితరుసబ్ కుంట పరిసర ప్రాంతంలోని అటవీ శాఖ భూమిలో ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కంటైనర్ ఏర్పాటు చేసి స్థలాన్ని ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం, చితరుసబ్ కుంట పరిసర ప్రాంతం అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే కంటైనర్ ఏర్పాటు చేసి ఆక్రమణకు పాల్పడ్డారని తెలిపారు. రాత్రి సమయంలో కంటైనర్ తీసుకువచ్చి ఏర్పాటు చేయడంతో ఉదయం గ్రామస్థులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు క్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అటవీ శాఖ భూములు ప్రజల ఆస్తి అని, వాటిని పరిరక్షించడం అధికారుల బాధ్యత అని గ్రామ యువకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆక్రమణలకు ఇది దారితీసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు.

ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆక్రమణను తొలగించి భూమిని స్వాధీనం చేసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ఆక్రమణకు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై అటవీ శాఖ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కిరణ్ కుమార్ రేంజ్ ఆఫీసర్ ఫోన్లో వివరణ కొరగా, పోలంపల్లి గ్రామ శివారులో ఉన్న అడవి శాఖ భూమి చితరు సబ్ కుంటలో అడవి శాఖ భూమి, కబ్జాకు గురైనది వస్తామే అని, దీని పై జిల్లా అధికారులకు, తెలియజేసి వారి ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.