గురుకులానికి నాగ దోషం!
- పాము కాటుతో ఇద్దరు విద్యార్థుల మృతి, 6గురు అస్వస్థత
- అసౌకర్యాల నెలవు, అభద్రతలో విద్యార్థులు
- మంత్రి వచ్చిన మారని తీరు
జగిత్యాల, డిసెంబర్ 20 (విజయ క్రాంతి): వేలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన చదువులమ్మ నిలయమది.. వందలాది మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతి నిధులను జాతికి అందించిన గురుకుల విద్యాలయమది... నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రస్తుతం దీనావస్థలో పాములకు నిలయమై విద్యార్థుల పాలిట ’నాగ’ దోషంగా, దిన దిన గండంగా మారింది.
ఒకప్పుడు చదువులమ్మ కోవెలగా విరాజిల్లిన పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాల, ప్రస్తుతం అసౌకర్యాల నిలయంగా మారి విద్యార్థులు అభద్రతా భావంతో రోజులు వెళ్లదీసే పరిస్థితి దాపురించింది. పాము కాటు కారణంగా గత సంవత్సరం ఇరువురు విద్యార్థులు చనిపోగా, ఇప్పటి వరకు 6గురు అస్వస్థతకు గురైనారు.
తమ పిల్లలకు ప్రభుత్వ గురుకులంలో మంచి విద్యతో పాటూ భోజన, వసతి లభిస్తుందన్న ఆశతో కష్టపడి సీటు పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల కలలు కల్లలుగానే మిగిలి పోతున్నాయి. నవంబర్ 1983లో 5నుండి 10వ తరగతి వరకు 300మంది విద్యా ర్థులతో ఈ పెద్దాపుర్ ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రారంభమైంది.
ప్రారంభ సమయంలో సుమారు 20 మంది టీచర్లు ఇదే క్యాంపస్‌లోని క్వార్టర్లలో ఉండేవారు. ప్రస్తుతం 5నుండి ఇంటర్ వరకు 600 సీట్లకు గానూ 511మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం 36మంది టీచింగ్ స్టాఫ్ ఉండగా, ఒక్కరు కూడా ఈ క్యాంపస్లో ఉండడం లేదు. పాము కాటుతో ఇరువురు విద్యార్థులు చనిపోక ముందు స్కూల్ సమయం ముగియగానే ఒక వార్డెన్, ఒక నైట్ డ్యూటీ టీచర్, ఒక ఏఎన్‌ఎం క్యాంపస్లో ఉండేవారు.
విద్యార్థుల మృతి అనంతరం ఒక వార్డెన్, ఇద్దరు నైట్ డ్యూటీ టీచర్లు, ఒక ఏఎన్‌ఎం, ఒక ఔట్సోర్సింగ్ అటెండర్ ఉంటున్నారు. ఈ గురుకులంలో తమ పిల్లలకు సీటు కోసం నానా తంటాలు పడ్డ తల్లిదండ్రులు, ప్రస్తుతం బతుకు జీవుడా అంటూ తమ ఊరికి తీసుకెళ్లి చదివిస్తున్నారు. గత ఎడాది సిరిసిల్ల జిల్లాకు చెంది 6వ తరగతి విద్యార్థి అనిరుద్, జగిత్యాల జిల్లా ఆరపేటకు చెందిన 8వ తరగతి విద్యార్థి గణాదిత్య పాము కాటుకు గురై చనిపోయారు.
ఆ సంఘటనతో స్పందించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్’రెడ్డి తదితర నాయకులు, కలెక్టర్ ఇతర అధికారులు ఈ పాఠశాలను సందర్శించారు. యుద్ధ ప్రాతిపదికన అవస రమైన నిర్మాణాలు చేపట్టి, కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు.
కాని మంత్రి వచ్చిన పరిస్థితులు మారక పోగా తాజాగా గత రెండు రోజుల క్రితం మరో ఇరువురు విద్యార్థులు పాము కాటుతో అస్వస్థతకు గురయ్యారు. తల్లి దండ్రుల, ప్రతిపక్ష నాయకుల, విద్యార్థి సంఘాల నిరసనలతో పాటు అసెంబ్లీలో చర్చలు జరిగినా పెద్దాపూర్ గురుకుల పాఠశాల దుస్థితి మాత్రం మారకపోవడం శోచనీయం. ఇప్పటికైనా పెద్దాపూర్ గురు కుల పాఠశాల పూర్వ వైభవానికి పకడ్బందీ ప్రణాళికతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
గురుకులంపై ప్రభుత్వం స్పందించాలి
కోరుట్ల, డిసెంబర్ 20: పెద్దాపూర్ గురుకుల పాఠశాల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్’కుమార్ డిమాండ్ చేశారు. పాము కాటుకు గురై కోరుట్లలోని కేశవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శుక్రవారం సాయంత్రం ఆయన పరామర్శించి, గురుకులాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో చనిపోగా, 6గురు అస్వస్థతకు గురైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు విద్యాశాఖకు మంత్రిలేని రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ఇప్పటికైనా సత్వర చర్యలు చేపట్టాలని పార్టీ పక్షాన సురభి డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ కోరుట్ల నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ చెట్లపెల్లి సుఖేందర్’గౌడ్, మండలాధ్యక్షుడు రాజ్’పాల్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు బోడ్ల రమేష్, జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి ఇందూరి తిరుమలవాసు తదితర నాయకులున్నారు.






