27 April, 2026 | 12:44 AM

ముగిసిన శీతాకాల సమావేశాలు

21-12-2024 03:00 AM
  • ఆరోపణలు, ప్రత్యారోపణలతో అట్టుడికిన పార్లమెంట్

అదానీపై చర్చించాలని ఇండియా... సోరోస్ ఆంశంపై ఎన్డీయే

వాయిదాలతోనే సరి

చివర్లో మరింత రగడ

స్పీకర్ తేనీటి విందుకు గైర్హాజరైన ప్రతిపక్షాలు

పెద్దల సభ నడిచింది కేవలం 43 గంటలే.. 

లోక్‌సభలోనూ అదే తీరు

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. గత నెలలో ప్రారంభమైన సమావేశాలు గొడవలు, అల్లర్లు, తోసుకోవడాలతో ముగిశాయి. అదానీ ముడుపుల వ్యవహారం గురించి జేపీసీ వేసి.. సభలో చర్చించాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. కాంగ్రెస్‌కు సోరోస్‌కు ఉన్న సంబంధం గురించి అధికార పక్షం విమర్శించింది. ఇక చివర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.

అంబేద్కర్‌ను అమానించారంటూ ప్రతిపక్ష ఎంపీలు పెద్ద నిరసనకు దిగారు. మేము కాదు ఇన్ని రోజులు అధికారంలో ఉండి మీరే అంబేద్కర్‌ను అమానించారంటూ బీజేపీ ఆరోపించింది. అధికార పక్షం కూడా నిరసనకు దిగడంతో తోపులాట జరిగి పలువురు ఎంపీలకు గాయాలయ్యాయి. 

రణరంగంలా పార్లమెంట్ ప్రాంగణం

శీతాకాల సమావేశాలు ఇంకో రోజులో ముగుస్తాయని అంతా అనుకుంటుండగా పార్లమెంట్ ప్రాంగణం రణరంగంలా మారిపోయింది. ఎంపీల పోటాపోటీ నిరసనలతో అట్టుడికిపోయింది. ఈ నిరసనల్లో జరిగిన తోపులాటలో అధికార పక్షానికి చెందిన ఇద్దరు ఎంపీలకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మీరు కావాలని చేశారంటే.. లేదు మీరే కావాలని చేశారంటూ రెండు పక్షాలు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. 

చివరి రోజూ నిరసనలే.. 

కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలపై చివరి రోజు కూడా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. మరో పక్క బీజేపీ పార్టీ కూడా సమావేశాల చివరి రోజు సందర్భంగా నిరసనలు చేపట్టింది. కాంగ్రెస్ కావాలనే తమ నాయకుడికి గాయం అయ్యేలా ప్రవర్తించిందని వారు ఆరోపించారు.

అంతే కాకుండా బీజేపీకి చెందిన అపరజిత సారంగి ప్రియాంక గాంధీకి ‘1984’ అని రాసి ఉన్న హ్యాండ్ బ్యాగును గిఫ్ట్‌గా అందజేశారు. ఆదివాసీ మహిళా ఎంపీ కొన్యాక్‌ను రాహుల్ దూషించారంటూ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టి కాంగ్రెస్‌కు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో తెలంగాణ ఎంపీలు ఈటల, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.  

తేనీటి విందుకు గైర్హాజరు..

శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా లోక్‌సభ స్పీకర్ సభలోని ఎంపీలందరికీ తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి మాత్రం ఆ విందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు హాజరుకాలేదు. ‘సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మా ఎంపీలపై కేసులు పెట్టారు. ఈ తేనీటి విందుకు పోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు’ అని వారు తెలిపారు.   

అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్: కిషన్ రెడ్డి

అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అవమానించిందని కిషన్‌రెడ్డి అన్నారు.అయితేఅంబేడ్కర్ విషయంలో ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీలు చంద్రప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లను కేంద్రమంత్రులు  కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ డా కె. లక్ష్మణ్ పరామర్శించారు. తమ ఎంపీలపై దాడికి దిగడం అత్యంత దురదృష్టకర మన్నారు. ఈ ఘటననను యావత్ సమా జం ఖండిస్తోందని, జరిగిన ఘటనకు బాధ్య త వహిస్తూ ఎంపీలకు, దేశ ప్రజలకు రాహు ల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

వాయిదాలతో సరి.. 

పెద్దల సభతో పాటు, లోక్‌సభ కూ డా వాయిదాల మీద వాయిదాలు పడింది. ఓ పక్క ఇండియా కూటమి ఎంపీలు, మరో పక్క ఎన్డీయే పక్ష ఎంపీల హోరాహోరీ నిరసనలు, ఆరోపణలతో సభ సరిగ్గా నడవలేదు. ఇక చివర్లో అయితే మరీ దారుణంగా ఒకరిని ఒకరు తోసుకున్నారు. దీంతో ఇద్ద రు ఎంపీలు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. వాయిదాల వల్లే లోక్‌సభలో 70 గంటల సమయం వృథా అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రెండో సెషన్ సమావేశాల్లో గరిష్టంగా సభ 115.21 గంటల పాటు జరిగింది. 

26 రోజుల్లో ఏడు బిల్లులే 

ఈ 26 రోజుల సమావేశాల్లో లోక్‌సభలో 20 సిట్టింగ్స్, రాజ్యసభలో 19 సి ట్టింగ్స్ జరిగినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటిం చారు.‘పార్లమెంట్‌లో చర్చా సమయం తగ్గేందుకు ప్రతిపక్షాలే కారణం. వారు సభను సజావుగా సాగనివ్వలేదు. ప్రతిసారి అంతరాయం కలిగించారు’ అని రిజిజు ఆరోపించారు.

మరో పక్క కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ‘మా దృష్టిలో ఈ సమావేశాల ఉత్పాదకత 100 శాతం. మహనీయుడు అంబేద్కర్ గురించి మోదీ, షా ఎలా ఆలోచిస్తున్నారో ఈ రోజు దేశం మొత్తానికి తెలిసింది’ అని అన్నారు. లోక్ సభ ఉత్పాదకత 57.87 శాతంగా నమోదైంది. ఈ 26 రోజులలో లోక్‌సభలో 4 బిల్లులు, రాజ్యసభలో మూడు బిల్లులు మాత్రమే ఆమోదం పొందినట్లు మంత్రి వెల్లడించారు. 

పెద్దల సభ 43 గంటలే 

ఈ శీతాకాల సమావేశాల్లో పెద్దల సభ అయిన రాజ్యసభ కేవలం 43 గంటల పాటు మాత్రమే నడిచిందని సభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ తెలిపారు. ధన్‌ఖర్ మాట్లాడుతూ ‘శీతాకాల సమావేశాల్లో ఎగువ సభ కేవలం 43 గంటల 27 నిమిషాలు మాత్రమే పని చేసింది. ఇకనైనా అర్థవంతమైన చర్చ చేయాలి’ అని చైర్మన్ హితవు పలికారు.

ప్రియాంకకు బ్యాగ్ బహూకరణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీకి శుక్రవారం పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ అపరాజితా షడంగి ‘1984’ అని ముద్రించి ఉన్న బ్యాగ్ బహూకరించడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఎంపీ అపరాజితా మాట్లాడుతూ.. ‘ప్రియాంకా గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ పాలనలో సిక్కులపై ఊచకోత జరిగింది.

ఆ ఊచకోతను ప్రియాంకకు గుర్తుచేసేందుకు నేను ఆమెకు ‘1984’ అని ముద్రించి ఉన్న బ్యాగ్‌ను బహూకరించాను. ఆమె బ్యాగును తీసుకునేందుకు ఇష్టపడలేదు. ఏమనుకున్నారో తెలియదు కానీ.. తర్వాత బ్యాగ్ తీసుకుని పక్కన పెట్టేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎలాంటి అకృత్యాలకు పాల్పడిందో నేటి తరానికి తెలియజెప్పాలనే బ్యాగ్ బహూకరించా’నన్నారు.

రాహుల్ గాంధీపై కేసు 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. రాహుల్ గాంధీ తమ పార్టీ ఎంపీలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారని బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషీ.. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాహుల్ గాంధీపై భారతీయ న్యాయ సంహితలోని 115, 117,125, 131, 351, 3(5) సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

సీనియర్ అధికారులతో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. పార్లమెంట్ వద్ద ఎన్డీయే పక్ష ఎంపీలు గురువారం ఉదయం 10 గంటలకు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా రాహుల్ గాంధీ అక్కడకు 10.40కి చేరుకుని వివాదాస్పదంగా ప్రవర్తించినట్టు పేర్కొన్నారు.

బలవంతంగా తమ ఎంపీలను రాహుల్ గాంధీ నెట్టేయడంతో ముఖేష్ రాజ్‌పుత్, ప్రతాప్ సారంగిలు తీవ్రంగా గాయపడ్డారని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. అనురాగ్ ఠాగూర్ మీడియాతో మాట్లాడుతూ హత్యాయత్నం, ఉద్దేశపూర్వక దాడికి సంబంధించిన సెక్షన్ల ప్రకారం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. నాగాలాండ్‌కు చెందిన మహిళా ఎంపీ పట్ల కూడా రాహుల్ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఠాగూర్ ఆరోపించారు.