పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు
హైదరాబాద్,(విజయక్రాంతి): కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లగచర్ల కేసులో నరేందర్ రెడ్డి సహా నిందితులుగా ఉన్న 24 మంది రైతులకు నాంపల్లి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఉన్నతాధికారులపై జరిగిన దాడి ఘటనలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నరేందర్ రెడ్డి అంతకు ముందే కొడంగల్ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.
లగచర్ల కేసులో నిందితుల తరుపున నమోదైన బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డితో సహా మిగతా నిందితులంతా దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ల తరుపు న్యాయవాది కోర్టు తెలిపారు. నరేందర్‌రెడ్డి రూ. 50 వేలు, మిగతా వారు రూ. 20 వేల పూచికత్తు సమర్పించాలని ఆదేశించిన నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.






