19 August, 2026 | 3:59 AM

విజ్ఞాన్స్‌లో ‘నశాముక్త్ భారత్’ మెగా క్యాంపెయిన్

19-08-2026 12:00 AM

మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల సామూహిక ప్రతిజ్ఞ

హైదరాబాద్, ఆగస్టు 18(విజయక్రాంతి): మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘నశాముక్త్ భారత్ అభియాన్’, ‘మిషన్ స్పందన్’లో భాగంగా సామూహిక ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. స్టూడెంట్ అఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం క్యాంపస్‌లోని ‘విజ్ఞాన్ కళాతోరణం’ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని, మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఆగస్టు 6 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘10 కోట్ల వ్యసనరహిత ప్రతిజ్ఞ మెగా క్యాంపెయిన్’లో భాగంగా... యువతలో డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులతో బ్రహ్మకుమారీస్ ప్రతినిధి డాక్టర్ శ్రీలత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థులను వ్యసనాలకు దూరంగా ఉంచడంలో క్రీడలు, శారీరక వ్యాయామం కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

క్రమశిక్షణతో కూడిన జీవనశైలే బలమైన సమాజానికి పునాది అన్నారు. యువత తమ దృష్టిని విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై సారిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి ‘వికసిత్ భారత్ 2047’ స్వప్నాన్ని సాకారం చేయాలని పిలుపునిచ్చారు.ఆధ్యాత్మిక విలువలు, ఆత్మనియంత్రణను యువత అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.