సీఎంఆర్ ధాన్యం గోల్ మాల్
- తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు
- కోదాడలో రైస్ మిల్లర్ అరెస్ట్
కోదాడ, ఆగస్టు 18 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని విజయలక్ష్మి రైస్ కార్పొరేషన్ మిల్లులో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) భారీ స్థాయిలో పెండింగ్ ఉండడంతో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ దశరథ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ బియ్యానికి సంబంధించిన లెక్కలను పరిశీలించారు.
2024-25,26 సీజన్లకు సంబంధించి మొత్తం 4,736.7 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి సుమారు రూ.13.51 కోట్ల మేర బకాయి ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మిల్లు యజమాని మేళ్లచెరువు శంకర్ రావును పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సీఎంఆర్ బియ్యాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి అప్పగించని మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.






