20 May, 2026 | 3:20 AM

విజ్ఞాన్స్‌ విద్యార్థికి జాతీయస్థాయి ఫెలోషిప్

20-05-2026 12:55 AM

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెలోషిప్‌కు ఎంపికైనట్లు యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మంగళవారం వెల్లడించారు.

దేశంలోని ప్రముఖ సైన్స్ అకాడమీలు సంయుక్తంగా అందించే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ) సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు యూనివర్సిటీలోని సీఎస్‌ఈ ఏఐఎంఎల్- విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎన్. ధారకేశ్ ఎంపికయ్యాడని తెలిపారు.

ఈ ప్రతిష్ఠాత్మక సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థి ధారకేశ్‌కు రూ.25వేలు ఫెలోషిప్ మొత్తాన్ని అంద జేయనున్నారని పేర్కొన్నారు. దుర్గాపూర్‌లోని సుప్రసిద్ధ పరిశోధనా సంస్థ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎం ఈఆర్‌ఐ)లో ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ అమన్ అరోరా పర్యవేక్షణలో ధారకేశ్ రియల్-టైమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌పై పనిచేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నట్లు వివరించారు.

కాగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డీ) ఆఫీస్ పర్యవేక్షణలో సాధించిన ఈ అద్భుత విజయంపై విజ్ఞాన్స్ విద్యాసంస్థల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. జాతీయ స్థాయిలో యూనివర్సిటీకి గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థి ధారకేశ్‌ను, అతనికి మార్గనిర్దేశం చేసిన మెంటార్లను, ఆర్‌అండ్‌డీ విభాగాన్ని యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి విజయాలు విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా, ఇతర విద్యార్థులకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.