17 May, 2026 | 5:01 AM

ఇది తండ్రీకొడుకుల ప్రేమికుల రోజు

15-02-2025 12:00 AM

సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. నటుడు ధన్‌రాజు తాను నటిస్తూ స్వీయ దర్శకత్వంలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పృథ్వీ పోలవరపు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదలవుతున్న నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను  స్టార్ హీరో నాని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. “ధన్‌రాజ్ నాకు కెరీర్ మొదట్నుంచీ పరిచయం.

అతని టాలెంట్ ఏంటో నాకు తెలుసు. అందుకే ‘రామం రాఘవం’ సినిమాకు ధన్‌రాజ్ దర్శకత్వం వహించాడంటే నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ధన్‌రాజ్ కామెడీ సినిమా తీస్తాడేమో అనుకున్నా.కానీ నాకు ఈ ట్రైలర్ చూపించి ఎమోషనల్ డ్రైవ్‌లోకి తీసుకెళ్లాడు. నిజంగా ఇది తండ్రీకొడుకుల ప్రేమికుల రోజు. సముద్రఖని వర్క్ అంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో ఇష్టం. ఆయనా, నేను ఫ్యామిలీలా ఉంటాం” అని చెప్పారు.

“నాకు సొంత తమ్ముడులాంటి నాని ‘రామం రాఘవం’ ట్రైలర్ లాంచ్ చేయటం సంతోషంగా ఉంది” అని నటుడు సముద్రఖని తెలిపారు. చిత్ర దర్శకుడు, నటుడు ధన్‌రాజ్ మాట్లాడుతూ.. ‘నేను దర్శకుడిగా వ్యవహరించిన మొదటి సినిమా ట్రైలర్‌ను నాని గారు లాంచ్ చేయటం హ్యాపీగా ఉంది. ఫాదర్ ఎమోషనల్ డ్రామాలో ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’ అన్నారు.

నిర్మాత పృథ్వీ మాట్లాడుతూ.. ‘కంటెంట్ ఫుల్‌గా ఉన్న మా సినిమా ట్రైలర్‌ను హీరో నాని గారు విడుదల చేయటం మా టీమ్‌కు మరింత ఉత్సాహాన్నిచ్చింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటి ప్రమోదిని, సంగీత దర్శకుడు అరుణ్ చిలివేరు తదితరులు పాల్గొన్నారు.