కళింగలో నవశకం
ఒడిశా సీఎంగా గిరిజన నేత మాఝీ ప్రమాణం
15 మంది మంత్రులతో కొలువుదీరిన సర్కారు
తూర్పు తీర రాష్ట్రంలో తొలిసారి బీజేపీ పాగా
హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు
డిఫ్యూటీ సీఎంలుగా ఇద్దరికి అవకాశం
భువనేశ్వర్, జూన్ 12: ఒడిశాలో కొత్త చరిత్ర మొదలైంది. ఈ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అందునా ఓ గిరిజన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. బీజేపీ నేత మోహన్ మాఝీ ఒడిశా సీఎంగా బుధవారం ప్రమాణం చేశారు. ఇద్దరు డిఫ్యూటీ ముఖ్యమంత్రులు, 8 మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు సహాయ (స్వతంత్ర హోదా) మంత్రులతో మాఝీ ప్రభుత్వం కొలువుదీరింది.
భువనేశ్వర్‌లోని జనతామైదాన్‌లో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో మాఝీ, ఇతర మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ రఘుబర్‌దాస్ ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ మాఝీ కియోంజర్ నియోజవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థి మినిమాఝీని 11,577 ఓట్ల తేడాతో ఓడించారు.
తరలివచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో మంత్రిమండలి ప్రమాణ స్వీకారానికి కేంద్రం ప్రభుత్వం మొత్తం కదిలివచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నితిత్ గడ్కరీ, జ్యూయెల్ ఓరం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కొత్త సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇద్దరు డిఫ్యూటీ సీఎంలు
మాఝీ మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులను డిఫ్యూటీ సీఎంలుగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. కియోంజర్‌కు చెందిన రాజకుటుంబీకుడు కేవీ సింగ్ దేవ్‌తోపాటు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ప్రవ తి పరీదాకు ఆ అవకాశం ఇచ్చింది. సింగ్‌దేవ్ ఎమ్మెల్యేగా గెలుపొందటం ఇది ఆరోసారి. ఆయన 2000 మధ్య బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. పట్నాగఢ్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరో డిఫ్యూటీ సీఎం ప్రవతి పరీదా మూడుసార్లు ఓటమి తర్వాత తాజా ఎన్నికల్లో నిమపరా నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 147 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 78 స్థానాలు గెలుచుకొన్నది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. గతంలో 1998 నుంచి 2009 వరకు 11 సంవత్సరాలు రాష్ట్రంలో బీజేడీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఒడిశాను పరిపాలించింది. ఈ రెండు పార్టీలు కలిసి మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. 2009 ఎన్నికల ముందు ఈ కూట మి విచ్ఛిన్నమైంది. కంధమాల్‌లో మతకలహాలు ఈ కూటమిని విడదీశాయి.






