పడిలేచిన కెరటం నారా లోకేష్
- రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం
మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలుపు
ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగు
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): పడిలేచిన కెరటంలా నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి మం త్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల ఏకైక సంతానమైన లోకేష్ చిన్నప్పటి నుంచి తండ్రి రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తూ పెరిగారు. అమెరికాలోని స్టాన్ ఫోర్ట్ వర్సిటీలో ఉన్నత విద్య చదివారు. 2017లో చంద్రబాబు వారసుడిగా ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది ఎమ్మెల్సీ పదవి పొంది, చంద్రబాబు క్యాబినెట్‌లో ఐటీ, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా కొలువుదీరారు.
రాజకీయ ప్రయాణంలో ఆయన ఎన్నో ఆటుపోట్లను చూశారు. అవహేళనలను ఎదుర్కొన్నారు. 2019 ఎన్నిక ల సమయంలో ప్రత్యర్థి పార్టీ ఆయన్ను ట్రోల్ చేసినా, ఆ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా, టీడీపీ అధికారాన్ని కోల్పోయినా వెనకడుగు వేయలేదు. ఆ ఓటమి ద్వారా గుణపాఠాలు నేర్చుకున్న లోకేష్ తనను తాను సానబట్టుకున్నారు. తన ఆహార్యం, మాట తీరును మార్చుకుంటూ వస్తూ రాజకీయాల్లో పరిణతి ప్రదర్శించారు. సరికొత్త జోష్‌తో యువగళం పాదయాత్ర చేపట్టారు. ఇటీవ ల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఓడిపోయిన మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఏకంగా 90 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయంసాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. బుధవా రం చంద్రబాబు క్యాబినెట్‌లో రెండోసారి మంత్రిగా ప్రమాణం చేశారు.






