నాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు
తెలుగునాట నాలుగుసార్లు సీఎంగా ప్రమాణం
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): తెలుగు నాట ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు ప్రమాణం చేసినవారిలో ఎన్టీఆర్ ప్రథముడు. తర్వాత ఆ ఘనతను టీడీపీ అధినేత చంద్రబాబు సాధించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవరెడ్డి సహా కొందరు రెండేసి సార్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు.
1983, 1984, 1985, 1994లో ఎన్టీఆర్..
1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది. పార్టీ అధినేత ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 1984లో అనారోగ్య పరిస్థితుల రీత్యా ఆయ న అమెరికాకు వెళ్లగా.. అదే సమయంలో నాదెండ్ల భాస్కర్‌రావు చక్రం తిప్పి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగొచ్చి, మళ్లీ సీఎం పదవి దక్కించుకున్నారు. అలా రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడిపే బదులు పూర్తి మెజార్టీ కోసం ప్రజల వద్దకు వెళ్లాలని 1985లో ఆయన అసెంబ్లీని రద్దు చేశారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విజయం సాధించి మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్లపాటు సంపూర్ణంగా పాలించారు. 1994 ఎన్నికల్లో విజయం సాంధించి నాలుగోసారి సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణం చేశారు.
1995, 1995, 2014, 2024లో చంద్రబాబు
1995లో నెలకొన్న రాజకీయ పరిస్థితు లు ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేశారు. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగా, ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014లో నవ్యాంధ్ర సీఎంగా ఆయన మూడోసారి సీంఎగా ప్రమాణ స్వీకారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించారు. ఆయన ఎన్టీఆర్‌తో సమానంగా నాలుగుసార్లు ముఖ్యమంత్రి పదవి అలంకరించినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువరోజులు సీఎంగా పనిచేసిన సీఎం మాత్రం చంద్రబాబు చరిత్రకెక్కారు.






