calender_icon.png 6 July, 2025 | 7:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సున్నితంగా చెప్పండి!

06-07-2025 12:00:00 AM

మనకి ఉండే కొన్ని అలవాట్ల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగినప్పుడు వాటిని పూర్తిగా మానుకోవడానికి లేదా ఇతరులను ఇబ్బందులకు గురి చేయకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. మరి, భాగస్వామి విషయంలో ఇలాంటి ఇబ్బంది కలిగించే అలవాట్లు ఉంటే ఏం చేయాలి? వీటి గురించి వారితో చర్చించడం అంత సున్నితమైన వ్యవహారమేమీ కాదు.

ఎందుకంటే ఇలాంటి విషయాలు మాట్లాడే సమయంలో ఏ మాత్రం మాట తూలినా అది దంపతులిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాలు చర్చించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మీ భాగస్వామితో మీకు ఇబ్బంది కలిగిస్తున్న అంశం గురించి వారితోనే నెమ్మదిగా చెప్పి చూడండి. అది మీకు ఎందుకు అంతగా ఇబ్బంది కలిగిస్తోంది? అనే విషయాన్ని వివరించండి.

సున్నితంగా వారికి నచ్చచెబితే తప్పకుండా వారిలో మార్పు కనిపించే అవకాశాలుంటాయి. అలాగే వారి అలవాట్ల వల్ల మీరు ఎంత అసౌకర్యంగా ఫీలవుతున్నారు? ఎందుకు వాటి మీద అంతగా దృష్టిసారిస్తున్నారు? అనే అంశాలను కూడా వారికి వివరించండి.

ఇలా చేయడం వల్ల మీకు ఇబ్బంది కలిగించకూడదనే ఆలోచనతో వారిలో మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న అలవాటును మార్చుకోవడానికో లేదా పూర్తిగా మానుకోవడానికో కాస్త సమయం పట్టడం సహజం. ఈ క్రమంలో మీరు వారిని ప్రోత్సహించేలా అందుకు తగిన సలహాలు, సూచనలు అందిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.