18-11-2025 12:00:00 AM
పటాన్ చెరు, నవంబర్ 17 :హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని నీరజ వడగం డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘లిక్విడ్ క్రోమాటోగ్రఫీని ఉపయోగించి ఫార్మాస్యూటికల్ డోసేజ్ ఫారమ్ లలో చిరల్ మలినాలను వేరు చేయడం, పరిమాణాత్మక అంచనా వేయడం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.
ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శరత్ బాబు హరిదాస్యం సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డాక్టర్ నీరజ పరిశోధన ఔషధ విశ్లేషణాత్మక శాస్త్రానికి విలువైన సహకారాన్ని అందిస్తోంది. ఆమె కీలక ఔషధాలలో చిరల్ మలినాల యొక్క స్టీరియో-సెలెక్టివ్ విభజన, పరిమాణీకరణ కోసం బలమైన, స్థిరత్వాన్ని సూచించే క్రోమాటోగ్రఫీ పద్ధతులను అభివృద్ధి చేశారు.
ఇది ఔషధ సూత్రీకరణలలో మెరుగైన నాణ్యత, భద్రతను నిర్ధారిస్తుంది. డాక్టర్ నీరజ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.