2 March, 2026 | 11:11 PM

శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఏర్పాట్లపై సమీక్ష

02-03-2026 09:40 PM

శ్రీశైలం/నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైలం దేవస్థానంలో మార్చి 16 నుంచి 20 వరకు జరిగే ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై సోమవారం కార్య నిర్వహణాధికారి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభానికి ముందే భారీగా భక్తులు వచ్చే అవకాశమున్నందున అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మార్చి 6 నుంచి 15 వరకు రోజుకు నాలుగు విడతలుగా స్పర్శదర్శనం, ఉగాది రోజుల్లో అలంకార దర్శనం మాత్రమే ఉంటుందన్నారు. కాలిబాట మార్గంలో మంచినీటి ట్యాంకులు, క్యూలైన్లలో తాగునీరు, అల్పాహారం, కూలర్ల ఏర్పాటు చేయాలని సూచించారు. అన్నదాన ప్రాంతాల్లో పందిళ్లు, లైటింగ్, నీటి సదుపాయం కల్పించాలని, తాత్కాలిక వైద్యశిబిరాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన మేరకు ఉచిత బస్సులు నడపాలని తెలిపారు.