17-11-2025 11:58:24 PM
పిసిపి స్టడీ సెంటర్ క్లాసులకు వచ్చిన డబ్బులను దోచుకున్నారు..
కరీంనగర్ (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ 180 ఓపెన్ స్కూళ్ల నుండి ఒక్క అడ్మిషన్కు రూ.100/- ల నుండి రూ. 200/- ల వరకు వసూలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓపెన్ స్కూల్లకు బుక్స్ పంపిణిీ చేయకుండా అమ్ముకున్నారు. 2021 నుండి 2025 ఆగస్టు వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాగా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా పనిచేసిన వ్యక్తి ప్రభుత్వ, ప్రైవేటు ఓపెన్ స్కూల్ ల నుండి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 180 ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఉంటే ఇందులో 160 స్టడీ సెంటర్లలో పిసిపి క్లాసులు నిర్వాహించారు. ఈ నిర్వాహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతి స్టడీ సెంటర్ కు 30వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.
కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేసిన వ్యక్తి ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ నుండి 30వేల రూపాయలలో 40% (12 వేలు) 60% (18 వేలు) తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం రూ. 21,60,000/- లు స్టడీ సెంటర్ల మీద అవినీతి జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నుండి ఒక్క అడ్మిషనుకు రూ.100/- లు, ప్రైవేటు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ల నుండి ఒక్క అడ్మిషనుకు రూ.200/- లు వసూలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ఏ ఒక్క ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్కి పూర్తి స్థాయిలో బుక్స్ ఇవ్వకుండా అమ్ముకున్నారు.. గతంలో, ఇప్పుడు పనిచేస్తున్న ప్రైవేట్, ప్రభుత్వ ఓపెన్ స్కూల్స్ కో-ఆర్డినేటర్ను పిలిచి ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు అవినీతి అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.