23-11-2025 01:07:47 PM
బంధువుల ఆగ్రహం మండి పొంగిన ఆందోళన
సంగారెడ్డి,(విజయక్రాంతి): ఎంఎన్ఆర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం మరొక కుటుంబాన్ని విలపింపజేసింది. రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో ఆసుపత్రిని ఆశ్రయించిన ఉద్యోగి కాశెట్టి సంతోష్ కుమార్ (44) చికిత్సలో నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడని బాధిత బంధువుల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
20 ఏండ్లుగా సేవలందించిన ఉద్యోగికే వైద్యం దొరకలేదా?
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్‌కు చెందిన సంతోష్ గత 20 ఏండ్లుగా ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా, హత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో బైక్ ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో స్వల్పంగా గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం తాను పనిచేస్తున్న ఎంఎన్ఆర్ ఆసుపత్రినే నమ్మి చేరాడు. అయితే, రెండు రోజులు చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం సంతోష్ మృతిచెందాడు. స్వల్ప గాయాలు ఉన్నా సరైన సమయంలో చికిత్స అందించకపోవడం వల్లే సంతోష్ ప్రాణాలు కోల్పోయాడు అని బంధువుల ఆరోపిస్తున్నారు.
నమ్మిన ఆసుపత్రే ప్రాణం తీసింది: కన్నీరు మున్నీరయిన కుటుంబం
సంతోష్ భార్య సంగీత కూడా అదే సంస్థలో పదేళ్లు పనిచేసిన విషయాన్ని బంధువులు గుర్తుచేస్తూ, ఏళ్ల తరబడి సేవ చేసిన ఉద్యోగికి కనీస వైద్యం అందించకపోవడం అమానుషం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎన్ఆర్ ఎదుట ఉద్రిక్తత: న్యాయం వచ్చే వరకు మృతదేహం తీసుకెళ్లం
బంధువులు, స్నేహితులు ఆసుపత్రి ఎదుట రాత్రి నుంచి మృతదేహం తరలించకుండా ఆందోళన చేస్తున్నారు. యాజమాన్యం పోలీసుల పర్యవేక్షణలో ఆసుపత్రి చుట్టూ భారీ భద్రత కల్పించారు. మీడియాను లోపలికి అనుమతించకుండా పోలీసులు ఆంక్షలు విధించడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
నిర్లక్ష్యం కప్పిపుచ్చేందుకు ఒత్తిడి
యాజమాన్యం స్పందించకుండా, తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకునేందుకు మృతదేహం బలవంతంగా తరలించాలని ఒత్తిడి తెస్తోంది అని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే శనివారం రాత్రి వరకు స్పందించని యాజమాన్యం, ఆదివారం ఉదయం మాత్రమే చర్చిస్తాం, న్యాయం చేస్తాం! అని చెబుతూనే, వెంటనే భారీ పోలీసు బలగాలను మోహరించడం మరింత అనుమానాస్పదంగా మారింది.
అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకోవాలి
బాధిత కుటుంబం, స్థానికులు, ఉద్యోగుల వర్గాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోయింది. చేసిన తప్పుకు బాధ్యులను అరెస్ట్ చేయాలి. కుటుంబానికి న్యాయం అయ్యే వరకు పోరాటం ఆగదు అని బంధువులు అంటున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, బాధ్యత వహించే అధికారులు వెంటనే జోక్యం చేసుకుని నిర్లక్ష్యానికి కారణమైన వైద్యులు, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.