09-12-2025 02:02:42 AM
వందేమాతర గీతాన్ని నెహ్రూ ముక్కలు చేశారు!
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గీతాన్ని ముక్కలు ముక్కలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. నాటి ముస్లిం లీగ్‌కు తలొగ్గి నెహ్రూ ఆ పనిచేశారని మండిపడ్డారు. వందేమాతరం అసలు సాహిత్యం ముస్లింలను రెచ్చగొట్టే అవకాశం ఉందని నెహ్రూనే స్వయంగా చెప్పారని వ్యాఖ్యానించారు. నెహ్రూ తీసుకున్న ఆ తరహా నిర్ణయాలే దేశ విభజనకు బీజం వేశాయని అభిప్రాయపడ్డారు.
వందేమాతర గీతం 150వ ఉత్సవాల వేళ సోమవారం పార్లమెంట్ వేదికగా చర్చ జరిగింది. లోక్‌సభలో సోమవారం ప్రధాని చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ .. 1937లో ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నా వందేమాతరం గీతంపై వ్యతిరేకత చూపా రని, కాంగ్రెస్ నాడు ముస్లిం లీగ్ వైఖరిని తప్పుబట్టాల్సి ఉండగా ఆ పని చేయలేదని మండిపడ్డారు.
నెహ్రూ నాడు అజాద్ హిం దు ఫౌజ్ అధినేత సుభాష్ చంద్రబోస్‌కు ఓ లేఖ రాశా రని, ఆ లేఖలో వం దేమాతర గీతం ముస్లింలను రెచ్చగొడుతుందేమోనని తాను భావిస్తున్నట్లు నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలోనే నెహ్రూ గీతంలోని మొత్తం చరణాలను యథాతథంగా ఉంచకుండా, కేవలం రెండు చరణాలకే పరిమితం చేశారని ఆరోపించారు. మిగిలిన ఆరు చరణాల్లో హిందూ దేవుళ్ల ప్రస్తావన ఉన్నందునే నెహ్రూ ఆ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
ఏదేమైనా.. వందేమాతర గీతం స్వతంత్య్ర ఉద్యమంలో పోరాట యోధులకు ప్రేరణగా నిలిచిందని కొనియాడారు. వందేమాతరం రాసిన ౫౦ ఏళ్లలో భారత్ బ్రిటీష్‌వారి ఏలుబడిలో ఉందని, ౧౦౦ ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ చీకట్లోనే ఉండిపోయిందని మండిపడ్డారు. వందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛా మంత్రం కాదని, వేదకాలం నుంచి భరతభూమి గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నా రు. పరాయి పాలనలో ఉన్న భారతీయుల్లో ఈ గీతం ఎన్నో ఆశలు నింపిందని గుర్తుచేసుకున్నారు. ఎందరో త్యాగాల వల్లే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు.
బంకిం దా కాదు.. బంకిం బాబు !
ప్రధానికి టీఎంసీ ఎంపీ సూచన
వందేమాతరం గీతంపై ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీని ప్రధాని అనేకసార్లు ‘బంకిం దాదా’ అని పలుమార్లు సంబోధించారు. టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ ఈక్రమంలో ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకుంటూ.. బంకించంద్ర ఛటర్జీని ‘దా’ అని సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘సోదరుడు’ అని ఎవరినైనా సంబోధించేందుకు బెంగాలీ భాషలో ‘దా’ అని వాడతారని తెలిపారు. కానీ, ఒక దేశం మెచ్చేస్థాయి రచయితను ‘సోదరుడు’ అని అర్థం వచ్చేలా సంబోధించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘బంకిం దా’ స్థానంలో ఆయన్ను ‘బంకిం బాబు’ అనవచ్చని సూచించారు. ప్రధాని వెంటనే స్పందిస్తూ.. ఇక నుంచి తాను ‘బంకిం బాబు’ అనే సంబోధిస్తానని వెల్లడించారు.
ముస్లింలీగ్‌కు తలొగ్గి ముక్కలు చేసిన నెహ్రూ
వందేమాతర గీతంలోని కొన్ని చరణాలు ముస్లింలను రెచ్చగొట్టేలా ఉన్నాయని బోస్‌కు నెహ్రూ లేఖ రాశారు. ఈ క్రమంలోనే గీతాన్ని రెండు చరణాలకు పరిమితం చేశారు. మిగిలిన ఆరు చరణాల్లో హిందూ దేవుళ్ల ప్రస్తావన ఉన్నం దునే నెహ్రూ ఆ నిర్ణయం తీసుకున్నారు. నెహ్రూ తీసుకు న్న ఆ తరహా నిర్ణయాలే దేశ విభజనకు బీజం వేశాయి.
పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ
గీతంపై అభ్యంతరాల వెనుక మతవాదులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు నెహ్రూ తలొగ్గి, వందేమాతరాన్ని రెండు చరణాలకు పరిమితం చేశారని పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఆమె మాట్లాడు తూ.. సుభాష్ చంద్రబోస్‌కు నెహ్రూ రాసిన లేఖలోని సారాంశంలో కొన్ని అంశాలను ప్రధాని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని విమర్శించారు.
లేఖలో ఉన్న సారాంశంలో కొన్నింటిని మాత్రమే ప్రధాని ఎంపిక చేసి మాట్లాడారని దుయ్యబట్టారు. 1930లో దేశంలో మతపరమైన కల్లోలాలు చోటుచేసుకోవడంతోనే వందేమాతర గీతం రాజకీయాల తాకిడికి గురైందని, వాటి వెనుక మతవాదులు ఉన్నారని మండిపడ్డారు. మిగిలిన చరణాలపై రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడని, ఆ చరణాలు మతపరంగా అపార్థం చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాడని గుర్తుచేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆర్‌ఎస్‌ఎస్ నేత శ్యామాప్రసాద్ ముఖర్జీ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సమయంలోనే వందేమాతరంలోని రెండు చరణాలకు పరిషత్తు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ఆరోపణలే నిజమైతే వందేమాతర గీతంపై నాడు ఏ సభ్యుడూ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని నిలదీశారు. రెండు చరణాలే పాడాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయించిన సమ యంలోనూ .. పార్టీ సభ్యు లుగా మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, ఠాగూర్ కూడా ఉన్నారని వివరించారు.
నెహ్రూ పాలనపై మేం చర్చకు సిద్ధం
నెహ్రూను కేంద్ర ప్రభుత్వం పదే పదే తప్పబట్టడంపై ప్రియాంక తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. నెహ్రూ గురించి మరింత చర్చ జరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, అందుకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. ‘మీరు నెహ్రూ ఏయే అంశాలపై మాట్లాడాలనుకున్న అంశాలన్నీ ఒక జాబితా చేద్దాం. వాటిపై చర్చిద్దాం. ఇక నెహ్రూ అం శాన్ని అక్కడితోనే ముగిద్దాం. ప్రజా సమస్యల గురించి కాకుండా.. వందేమాతరం గురించి చర్చిస్తున్నట్టుగా నెహ్రూ గురించి కూడా చర్చించుకుందాం’ అని సూచించా రు.
వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిపెట్టుకొనే బీజేపీ సభ్యులు వందేమాతర గీతంపై చర్చకు తెరతీశారని మండిపడ్డారు. దేశ ప్రజలు సంతోషంగా లేరని, వారిని ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయని, కానీ కేంద్రం ప్రభుత్వం వాటిని పక్కనపెట్టిందని మండిపడ్డారు. ‘1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా ఓ కాంగ్రెస్ సమావేశంలో వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ విషయాన్ని ప్రధాని ఎందుకు ప్రస్తావించలేదు?’ ప్రశ్నించారు. ఆ సభ హిందూ మహాసభ లేదా ఆర్‌ఎస్‌ఎస్ సభ కాదని గుర్తుచేశారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరం ఆలపించిన సమావేశం.. కాంగ్రెస్ సమావేశమేనని చెప్పేందుకు ప్రధాని ఎందుకు సంకోచిస్తున్నారని నిలదీశారు. దేశ స్వాతంత్య్రం కోసం 12 ఏళ్లు నెహ్రూ జైల్లో గడిపారని, ఆయన ఇస్రో స్థాపించకుంటే ఇప్పుడు మంగళ్‌యాన్ వంటి ప్రయోగాలు కూడా ఉండేవి కావని నొక్కిచెప్పారు. డీఆర్‌డీఓ, ఐఐటీలు, ఐఐఎంలన్నీ నెహ్రూనే స్థాపించారని గుర్తుచేశారు. ‘మీరు ఇప్పడు అమ్మేస్తున్న సంస్థలను నెహ్రూ స్థాపించకుంటే, మీ ‘వికసిత్ భారత్’ ఉండేదా?’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బెంగాల్ ఎన్నికల కోసమే వందేమాతరంపై రచ్చ
వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిపెట్టుకొనే బీజేపీ సభ్యులు వందేమాతర గీతంపై చర్చకు తెరతీశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆర్‌ఎస్‌ఎస్ నేత శ్యామాప్రసాద్ ముఖర్జీ చట్టసభలో ఉన్న సమయంలోనే వందేమాతరంలోని రెండు చరణాలకు సభ ఆమోదం తెలిపింది.
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎంపీ ప్రియాంకా గాంధీ