వర్ష బీభత్సం
- గంటన్నరలోనే నగరంలో అల్లకల్లోలం
- హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షం
- చెరువుల్లా మారిన నగర రహదారులు.. వాహనదారుల ఇబ్బందులు
- రెండుచోట్ల పిడుగుపాట్లతో ఉలిక్కిపడిన నగరవాసులు
- జవహర్‌నగర్ ప్రాంతంలో ఇళ్లల్లోకి పాములు
- చైతన్యపురి పోలీసు స్టేషన్‌లోకి ముంచెత్తిన వరద
విజయక్రాంతి నెట్‌వర్క్, ఆగస్టు 20: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. జోరు వానకు రహదారులన్నీ చెరువులను తలపించాయి. నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో స్థానికంగా నివాసం ఉండేవారు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చెట్లు విరిగిపడడంతో పాటు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం 4.45 గంటల నుంచి 6.15 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది.
కేవలం గంటన్నర వ్యవధిలో కురిసిన వర్షంతో నాలాలు పొంగిపొర్లాయి. చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లోకి వరద నీరు ముంచెత్తింది. పంజాగుట్ట, మియాపూర్ ప్రాంతాల్లో పిడుగుపాటుకు ప్రజలు ఉలిక్కిపడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని యూసుఫ్ గూడ ప్రాంతంలో అత్యధికంగా 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా బాలానగర్‌లోని ఫతేనగర్‌లో 9.5 సెం.మీ నమోదైంది. పంజాగుట్ట సమీపంలో పిడుగుపడి ఓ కారు ధ్వంసమైంది. నగరంలోని మూసారాం బాగ్ వద్ద మూసీ ఉరకలెత్తి ప్రవహించింది. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనిలో జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ సిబ్బంది నిమగ్నమయ్యారు.
- యూసుఫ్‌గూడ ప్రాంతంలోని శ్రీకృష్ణా నగర్‌లో రోడ్డుపై వరద ప్రవాహానికి ఓ కారుతో పాటు ఆటో కొట్టుకుపోతుండగా స్థానికంగా యువకులు వాటిని అడ్డుకున్నారు.
- ఇందిరానగర్‌లో రోడ్డుపై ఓ యువకుడు వెళ్తున్న బైక్ వరదకు కొట్టుకు పోతుంటే గమనించి పలువురు యువకులు కాపాడారు.
- భారీ వర్షానికి బషీర్‌బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి ఆనుకొని ఉన్న ఎల్‌బీ స్టేడియం ప్రహరీ కూలింది.
- పంజాగుట్ట సమీపంలో పిడుగు పడటంతో ఓ కారు ధ్వంసమైంది. కూకట్ పల్లి వెంకటేశ్వర నగర్‌లో ఓ ఇంటి మిద్దెపై పిడుగు పడినట్లు శబ్దం రావడంతో డ్యామేజ్ అయ్యింది.
- కుషాయిగూడలోని విస్టా హోమ్స్‌లో ఉన్న చెట్టు కూలి ఓ ఇంటిపై పడడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.
- జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. అంతేకాకుండా పలువురి ఇళ్లల్లోకి పాములు వచ్చాయి.
- ముషీరాబాద్‌లోని ఓ కిరాణా దుకాణంలో వరద నీరు చేరడంతో ఆ దుకా ణంలోని బియ్యం, పంచదార తదితర సామగ్రి తడిసి ముద్దయ్యాయి.
- మలక్‌పేట రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు మోకాళ్ల లోతు వరకు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్ప డింది. అదే విధంగా ఆజంపురా ఆర్‌యూబీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది.
- రాజేంద్రనగర్, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో వర్షం కారణంగా పలు లోతట్టు కాలనీలు నీట మునిగాయి. వర్షాల కారణంగా రంగారెడ్డి, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న విద్యాసంస్థలకు జిల్లా విద్యాశాఖ అధికారి మంగళవారం సెలవు ప్రకటించారు.
- వనస్థలిపురం కరెంట్ ఆఫీస్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అడ్డంగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. కొత్తపేటలోని వాసవీ కాలనీలో ఓ భారీ వృక్షం రోడ్డుపై నేలకూలింది.
- ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడంతో మూసీ నదికి భారీగా వరద వస్తోంది.
- చాంద్రాయణగుట్ట ప్రధాన రోడ్డు మార్గంలో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలను పోలీసులు నియంత్రించారు. రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనా లు నీట మునిగాయి. బహదూర్‌పురా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వరద నీరు చేరింది.
- జగిత్యాలలో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాము, రేషన్ బియ్యం దుకాణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎరువుల బస్తాలు, బియ్యం బస్తాలు తడిచిముద్దయ్యాయి.
- అలంపూర్ నియోజకవర్గంలోని రాయచూర్ కర్నూలు అంతర్ రాష్ట్ర రహ దారిపై అయిజ దగ్గర నీటి ప్రవాహం పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సాయంత్రం మళ్లీ వర్షం..
ఉదయం కురిసిన వర్షానికే నగరం అతలాకుతలం కాగా, సాయంత్రం మళ్లీ వర్షం కురిసింది. సాయంత్రం రామచంద్రాపురంలో అత్యధికంగా 4.4 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో 1.7 సెం.మీ వర్షపాతం నమోదైంది.
నగరానికి ఎల్లో అలర్ట్..
హైదరాబాద్ నగరంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షం మరో ఐదు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు నగరంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు.
నేడు పలు జిల్లాల్లో భారీ వర్షం
మరో 4 రోజుల పాటు వానలు
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో బుధ వారం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.ఈ నెల 25వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
వరద ఉధృతికి కొట్టుకొచ్చిన మృతదేహం
వరద ఉధృతికి పార్శీ గుట్ట నుంచి రాంనగర్ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకొ చ్చింది. ప్రేయర్ పవర్ చర్చి దగ్గరలో నివసించే విజయ్ అలియాస్ అరుణ్ కుమార్ (43) అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన ఇంటి ఎదురుగా ఉన్న కిరాణా షాపు మెట్లపై నిద్రపోయినట్టుగా స్థానికులు చెబుతున్నారు. తెల్ల వారుజామున 5 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో రోడ్డు దాటి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా వరదలో కొట్టుకుపోయినట్టుగా స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఈ సమయంలో అధిక శాతం నీరు తాగడంతో మరణించి ఉంటాడని భావిస్తున్నారు. విజయ్ మృతదేహం ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు టైరు తగిలి అక్కడే ఆగిపోయింది. వారాసిగూడ ఏఎస్సై వెంకటేశ్వర్లు శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.






