17-11-2025 01:12:15 AM
యజమానిని తాళ్లతో బంధించి, నోటికి ప్లాస్టర్ వేసి, కర్రలతో దాడి.. భారీ చోరీ
-రూ.50 లక్షల విలువైన 25 తులాల బంగారం, రూ.23 లక్షల నగదు అపహరణ
-నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరోసారి రెచ్చిపోయింది. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్‌రాక్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న కెప్టెన్ గిరి (75) అనే రిటైర్డ్ అధికారి ఇంట్లో దోపిడీకి పాల్పడింది.
ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన వ్యక్తే, తన సహచరులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఒంటరిగా ఉన్న వృద్ధుడిని కట్టేసి, కర్రలతో దాడి చేసి, సుమారు రూ.50 లక్షల విలువైన బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది.
శనివారం రాత్రి కెప్టె న్ గిరి భార్య పంజాగుట్టలోని బంధువుల ఇంటికి వెళ్లడంతో, ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఇదే అదనుగా భావించిన ఇం ట్లో పనిచేస్తున్న నేపాలీ దం పతులు రాజు, పూజ.. మరో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి దోపిడీకి పథకం రచించారు. నిద్రిస్తున్న గిరిని తాళ్లతో మం చానికి కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేశారు. మత్తుమందు తాగించేందుకు ప్రయత్నించగా, గిరి వారిని ప్రతిఘ టించారు.
దీంతో ఆగ్రహానికి గురైన దుండగులు, ఆయనపై కర్రలతో దాడి చేసి, బీరువాలో ఉన్న 25 తులాలకు పైగా బంగారం, రూ.23 లక్షల నగదును దోచుకున్నారు. గిరి ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా లాక్కెళ్లారు. ఇంట్లో పనిచేస్తున్న మరో మహిళకు కూడా మత్తుమందు ఇచ్చి ఆమెను అపస్మారక స్థితిలోకి నెట్టారు.
పక్కింటి వారి సహాయంతో ఫిర్యాదు
దుండగులు వెళ్లిపోయిన తర్వాత, ఎలాగోలా కట్లు విప్పుకున్న గిరి.. పక్కింటి వారి సహాయంతో కార్ఖానా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలా నికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లతో ఆధారాలు సేకరించారు.
కార్ఖా నా ఏసీపీ రమేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలిం చి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి, నిందితుల కోసం ఆరు ప్రత్యే క బృందాలను రంగంలోకి దించారు. నగరంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తు న్నామని ఏసీపీ తెలిపారు. నిందితులు నేపాల్ పారిపోకుండా సరిహద్దుల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో గాలిస్తున్నట్టు చెప్పారు.