16-02-2026 01:28:44 AM
మేయర్ ఎన్నికపై ఉత్కంఠ
బీజేపీ సభ్యులను క్యాంపునకు తరలించిన కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్
బీజేపీ రాకుండా రంగంలోకి రాష్ట్ర కాంగ్రెస్ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం
కరీంనగర్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ 66 డివిజన్లకుగాను 30 డివిజన్లు కైవ సం చేసుకొని మేయర్ పీఠాన్ని అధిష్ఠించే దిశగా అడుగులు వేస్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సరికొత్త సమీక రణలకు తెరలేపింది.
కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక క్యాంపునకు తమ సభ్యులను తరలించగా, కాంగ్రెస్ రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లకు బాధ్యతలు అప్పగించి.. బీజేపీ మేయ ర్ కాకుండా ఎత్తుగడలు వేస్తున్నది. కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ తరఫున ఎక్స్ అఫిషియో సభ్యుడిగా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్‌ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాం గ్రెస్ ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నారు.
మొత్తం వీరితో కలిపి 69 సభ్యులు అవుతుండగా 35 సభ్యుల బలం ఉన్న పార్టీకి మేయర్ పీఠం దక్కుతుంది. కాంగ్రెస్ నుంచి 14 మంది గెలుపొందగా, బీఆర్‌ఎస్ నుంచి 9 మంది, ఎంఐఎం నుంచి ముగ్గురు గెలుపొందారు. ఈ మూడు పార్టీల బలం 26 మంది సభ్యులు అవుతుండగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఇద్దరు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఇద్దరు ఉన్నారు. వీరితో కలుపుకొని 30 అవుతుండగా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు అవసరం ఉం టుంది. బీజేపీ ఎక్స్ అఫిషియో సభ్యుడితో కలిపి 31 మంది ఉండగా నలుగురు సభ్యు లు అవసరం అవుతారు.
స్వంతంత్రులకు గాలం
ఇండిపెండెంట్లుగా 8 మంది గెలుపొందారు. బీజీపీ శిబిరంలో ముగ్గురు ఇండిపెం డెంట్లతో పాటు ఒక ఏఐఎఫ్‌బీ సభ్యుడి భర్త క్యాంపులో ఉన్నారు. అనూహ్యంగా 27 డివిజన్ నుంచి ఏఐఎఫ్‌బీ నుంచి గెలుపొందిన తోట శ్యామల ఆదివారం తన కారులో బయల్దేరుతూ తాను ఓటింగ్ రోజు వస్తానని, తన ఇష్టం ఉన్నవారికి ఓటేస్తానని ప్రక టించారు. ఆమె భర్త బీజేపీ క్యాంపులో ఉం డగా, భార్యను కాంగ్రెస్ వారే తమవైపు తిప్పుకున్నారని ప్రచారం జరుగుతున్నది.
ఫా ర్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలిచిన శ్యామల, మరో కార్పొరేటర్ సాయిజ్యోతి, స్వతంత్ర కార్పొరేటర్లు కొమరయ్య, నందిని ఉదయ్, మల్లేశం, మాజీద్ హుస్సేన్, ఎంఐఎంకు చెందిన ముగ్గురు కార్పొరేటర్లు సైతం హైదరాబాద్‌లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. స్వతంత్రులుగా గెలుపొందిన వారికి, ఇతర పార్టీల వారికి భారీ ఆఫర్లు ప్రకటిస్తూ ఫోన్లు వస్తుండటం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఇద్దరు మంత్రులు రంగంలోకి దిగి ఈ వ్యవహారాలు నడిపిస్తుండటంతో బీజేపీకి మేయర్ ఎలాగైనా దక్కించుకోవాలన్నా వ్యూహంలో కేంద్ర మంత్రి ఉన్నారు. కరీంనగర్ మేయర్ ఎన్నిక స్వతంత్రుల పంట పండిందని నగరవాసులు చర్చించుకుంటున్నారు.
అయితే డబ్బులకు అమ్ముడు పోవడంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఎన్నిక రేపు జరుగుతుందా, కోరం లేక వాయిదా పడుతుందా వేచి చూడాల్సిందే. మొత్తం సభ్యులు ఆయా క్యాంపుల నుండి సోమవారం నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. బీఆర్‌ఎస్ విప్ జారీ చేస్తుందా లేదా అన్నది సోమవారం ఉదయం వరకు తేలనుంది.