3 March, 2026 | 4:11 AM

భారత్-కెనడా మధ్య నవశకం

03-03-2026 12:57 AM
  1. ప్రధాని మోదీతో కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ

2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే ధ్యేయం 

తొలుత 3 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు 

వ్యాపార, ఆర్థిక లక్ష్యాలు, ఇంధన రంగంలో భాగస్వామ్యం

న్యూఢిల్లీ, మార్చి ౨: భారత్- కెనడా మధ్య సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత పర్యటనలో భాగంగా సోమవారం కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ న్యూఢిల్లీ చేరుకున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 2018 తర్వాత ఒక కెనడా ప్రధాని భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. గతంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడమే లక్ష్యంగా రెండు దేశాలు ముందడుగు వేశా యి. ఇరు దేశాలు ఇకపై పరస్పర విశ్వాసం, గౌరవంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి.

భారత్- కెనడా మధ్య ద్వైపా క్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరుదేశాధినేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కెనడా పెన్షన్ ఫం డ్స్ ఇప్పటికే భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడంపై భారత ప్రధా ని మోదీ హర్షం వ్యక్తంచేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (సీఈపీఏ) త్వరలోనే ఖరారు చేయాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగి ఆర్థిక వృద్ధికి బాటలు పడతాయని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం యూరేనియం సరఫరా ఒప్పందం.

భారత్‌లోని అణు విద్యుత్ కేంద్రాల కోసం కెనడా పదేళ్ల పాటు యూరేనియం సరఫరా చేసేందుకు అంగీకరించింది. అనంతరం రెండు దేశాలు సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నా యి. అలాగే చిన్న తరహా అడ్వాన్స్‌డ్ రియాక్టర్ల తయారీలోనూ పరస్పరం సహకరిం చుకోవాలని నిర్ణయించారు. అలాగే కెనడా అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ)లో చేరడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఒప్పందాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగంలో ఇరు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లు అనుసం ధానం కానున్నాయి. తీవ్రవాదంపైనా ఉమ్మడి పోరాటానికి అడుగులు పడనున్నాయి.

నిజ్జర్ హత్య కేసుపై భారత్ స్పందన

నిజ్జర్ హత్య కేసులో ఇద్దరు భారత అధికారులకు సంబంధం ఉందన్న కెనడా మీడియా వార్తలను భారత్ మరోసారి ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి సున్నితమైన అంశాలను బహిరంగంగా కాకుండా చట్టపరమైన ప్రక్రియల ద్వారా పరిష్కరించు కోవాలని సూచించింది.

ఏవైనా ఆధారాలు ఉంటే అందించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని భారత్ పేర్కొంది. ఇరు దేశాలు సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి.