13-02-2026 01:07:18 AM
సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో ప్రారంభం
సీఈవోలుగా ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరు
ఉద్యోగ సంఘాల నాయకులకు సూచించిన సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి) : మరో పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశంలో నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.
సచివాలయంలో గురువారం సీఎస్ అధ్యక్షతన జరిగిన ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సీవీ ఆనంద్, మహేశ్ దత్ ఎక్కా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూలతోపాటు పలు ఉద్యోగ, ఉపా ధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ఉద్యోగుల నూతన హెల్త్ స్కీమ్‌కు ఉద్యోగుల తరఫున తమ బేసిక్ సాలరీలో 1.5 శాతం మొత్తాన్ని, ప్రభుత్వం తరఫున కూడా 1.5 శాతం కేటాయించాలన్న ప్రతిపాదనను ఈ సమావేశంలో అంగీకరించారు. ఈ హెల్త్ స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను మరికొద్ది రోజుల్లో ఖరారుచేసి, ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని సీఎం, డిప్యూటీ సీఎంల ద్వారా ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నాయకులకు సీఎస్ సూచించారు.
ఈ సందర్భంగా ఈ నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ర్టంలో లక్షా 44 వేల మంది పెన్షనర్లు, రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, 12.84 లక్షల మంది డిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. ఈ ఉద్యోగులు, పెన్షనర్లలో నాలుగవ తరగతి ఉద్యోగులు, నాన్ గెజిటెడ్, గెజిటెడ్, పెన్షనర్లు తమ బేసిక్-పేలో 1.5 శాతం మొత్తాన్ని చెల్లిస్తే సంవత్సరానికి రూ.528 కోట్లు జమ అవుతాయని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం తన వాటాగా ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులుంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ఈ ట్రస్టు సీఈవోగా నియమిస్తారు. ఉద్యోగులకు ఉత్తమమైన వైద్య సదుపాయాలను అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, ప్రస్తుతం ప్రతిపాదించిన నూతన హెల్త్ స్కీమ్ ఒక ముందడుగు అని సీఎస్ తెలిపారు. రానున్నకాలంలో ఈ పథకంలో మార్పులు, చేర్పులపై ట్రస్ట్ సమావేశంలో నిర్ణయిస్తారని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ సెక్రటేరియేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ దేవేందర్, పీఆర్‌టీయూకు చెందిన దామోదర్ రెడ్డి, తెలంగాణ యూటీఎఫ్‌కు చెందిన చావా రవి, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, తెలంగాణ రిటైర్డ్ అధికారుల సంఘం జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్య, మహిళా అధ్యక్షురాలు ఉమాదేవి, తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి చెందిన నాగాంబ, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దాస్య నాయక్, ప్రధాన కార్యదర్శి సాయికుమార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ, కార్యదర్శి నర్సరాజు తదితరులు పాల్గొన్నారు.