26 July, 2026 | 3:09 AM

వాణిజ్య పన్నుల శాఖలో ప్రక్షాళన!

27-06-2024 04:08 AM
  • ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా పనిచేసేలా ప్రత్యేక చర్యలు

అధికారులతో ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ సమీక్ష

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): వాణిజ్య పన్నుల శాఖలో ప్రక్షాళన దిశగా కొత్తగా నియామకమైన ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ అంచనాలు, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు బుధవారం కమర్షియల్ టాక్స్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఉద్యోగులు, సిబ్బందికి ఆయన కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే కీలక శాఖల్లో ఇది ఒకటి. ఈ శాఖ పనితీరు ప్రభుత్వ పనితీరుపై ఆధారపడి ఉంటుందనేది ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిజ్వీ తొలిసారి చేపట్టిన రివ్యూ ఇది. ఈ సమీక్షలో ఆయన శాఖకు సంబంధించిన వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల పనితీరుపైనా ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా కమర్షియల్ టాక్స్ ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది వివరాలను రిజ్వీకి అధికారులు వివరించారు. అలాగే, ఇటీవల ఆర్థిక శాఖకు పంపిన బడ్జెట్ అంచనాలకు ప్రిన్సిపల్ సెక్రటరీకి కమిషనర్ శ్రీదేవి వెల్లడించినట్లు సమాచారం.

వసూలు ఎంత?

వాణిజ్య పన్నుల శాఖలో వసూళ్లను ప్రధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం శాఖకు ఎంత లక్ష్యాన్ని నిర్దేశించింది? ఎంత వసూలవుతుంది? అనే విషయాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో పన్ను వసూళ్లను 100 శాతం సాధించేందుకు అధికారులకు రిజ్వీ కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కొందరు ట్యాక్స్ ఎగ్గొట్టడానికి అధికారులే సహకరించారన్న ఆరోపణల నేపథ్యంలో పన్నుల శాఖలో కొన్ని మార్పులు చేస్తే.. పనితీరు మరింత మెరుగుపడుతుందన్న ఆలోచనలో రిజ్వీ ఉన్నట్లు సమాచారం. 

వసూళ్లపై రాజీపడేది లేదు

వాణిజ్య పన్నుల వసూళ్లలో అధికారులు రాజీపడొద్దని ప్రిన్సిపల్ సెక్రటరీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా బకాయిలను రాబట్టే విషయంలో అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని సూచించినట్లు సమాచారం. బకాయిల వసూళ్లలో ఎదరువుతున్న సవాళ్లను కూడా రిజ్వీ అడిగి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పన్నుల సమయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే వాణిజ్య పన్నుల శాఖలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎలా ముందుకెళ్లాలనే దానిపై ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని రిజ్వీ వ్యక్తపరిచినట్లు సమాచారం.

ఉద్యోగుల సమస్యలపై.. 

వాణిజ్య పన్నుల శాఖలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ సంఖ్యలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాఖలోని ఉద్యోగుల సమస్యలపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆరా తీసినట్లు సమాచారం. వాస్తవానికి వాణిజ్య పన్నుల శాఖలో 16 నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు.