14-08-2025 01:52:16 AM
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామంలో ఇన్ని ఓట్లు ఎలా పెరిగినయ్!
- మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): మెదక్ నియోజకవర్గంలోని ఐలా పూర్ అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నట్లుండి ఒకేసారి 700 పైగా ఓట్లు ఎలా పెరిగాయో విచారణ జరిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్కే భవన్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ఏడాది జనవరి 10న స్థానిక సర్పంచ్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇచ్చిన ఫైనల్ ఓటర్ లిస్ట్ కంటే నెల ముందు కూడా ఫిర్యాదు చేశామన్నారు. గతేడాదే జనవరి 19న కూడా జిల్లా కలెక్టర్‌కు అదే సర్పంచ్‌తో ఫిర్యాదు ఇప్పించామని గుర్తు చేశారు.
గతేడాది ఫిబ్రవరి 28న తుది ఓటర్ లిస్టు వచ్చాక తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశామ న్నారు. అప్పటి సీఈ వో వికాస్‌రాజ్‌కు సైతం గతేడాది ఏప్రి ల్ 15న ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఒక చిన్న పల్లెటూరులో 950 ఉండాల్సిన ఓట్లు దాదాపుగా 700 ఓట్లు ఎట్లా పెరిగాయని ఆయన ప్రశ్నించారు.
ఐలాపూర్‌లో ఉన్న ఇండ్ల వివరాల సిరీస్ 1-1 నుంచి 3-8 వరకు ఇండ్లు ఉంటే.. శ్మశానవాటికకు, బోరింగ్‌కు, ట్యాంక్‌కు కూడా ఇంటి నెంబర్లు ఇచ్చి ఇష్టమున్నట్టుగా ఓటర్లను కలిపారని తెలిపారు. 950 ఓట్లు ఉండాల్సిన ఐలాపూర్‌లో ఇప్పుడు ఏకంగా 2500 ఓట్లు కనిపిస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ మీ పాలన ఉన్న తెలంగాణలో ఒక పల్లెటూరులొనే 950 ఓట్లు కాస్త 2500 పెరిగడంపై సమాధానం చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు.