నిండుకుండలా హుస్సేన్ సాగర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎఫ్‌టీఎల్‌కు మించి చేరడంతో అధికారులు వరద నీటిని లోతట్టు ప్రాంతంలోని మూసీలోకి వదలాల్సి వచ్చింది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 513.41 మీటర్లు కాగా, మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఉదయం 10.40 గంటలకు 513.63 మీటర్లకు చేరింది. ఈ సమయంలో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. హుస్సేన్ సాగర్ నీటిని స్లూయిస్ ద్వారా దిగువ ప్రాంతంలోని మూసీ నాలాలోకి విడుదల చేశారు.
హుస్సేన్ సాగర్ ఇన్‌ఫ్లో 1850 క్యూసెక్కుల నీరు ఉండగా, నీటి నిర్వహణలో భాగంగా 1600 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. అయితే, ముందుగా స్లూయిస్‌ను 2 అడుగుల మేరకు మాత్రమే ఎత్తి నీటిని వదిలారు. అయితే, వరద పెరగడంతో వాటర్ లెవల్ మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 513.64 మీటర్లకు చేరింది. దీంతో స్లూయిస్‌ను ఎత్తును 3.5 అడుగులకు ఎత్తి అధిక నీటిని విడుదల చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత వర్షం మళ్లీ కురవడంతో రాత్రి 9.20 గంటలకు నీటి మట్టం 513.66 మీటర్లకు చేరుకుంది. ఈ సమయంలో హుస్సేన్ సాగర్ ఇన్‌ఫ్లో 2500 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.






