24 May, 2026 | 6:21 AM

రాఖీకి బస్సెక్కిన 63.86 లక్షల మంది

21-08-2024 05:39 AM
  1. ఆర్టీసీలో రికార్డు స్థాయి ప్రయాణాలు 
  2. 41.74 లక్షల మంది మహిళల ఫ్రీ జర్నీ
  3. ఒక్కరోజే మహిళలకు రూ.17 కోట్ల ఆదా 
  4. సిబ్బందిని అభినందించిన మంత్రి పొన్నం

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా  ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. సోదరులకు రాఖీ కట్టేందుకు అక్కాచెలెళ్లు  పెద్దఎత్తున ప్రయాణాలు చేశారు. సోమవారం ఒక్క రోజే ఆర్టీసీ రికార్డు స్థాయిలో 63.86 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేసింది. 41.74 లక్షల మంది మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఈ స్థాయిలో మహిళలు ఒక్క రోజులో బస్సు ప్రయాణాలు చేయలేదు. ఒక్క రోజులో మహిళలు రూ.17 కోట్ల మేర ఆదా చేసుకున్నారు. 

ఆర్టీసీకి రికార్డు ఆదాయం 

రాఖీ సందర్భంగా ఆర్టీసీకి  రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల రాబడి వచ్చింది. మహాలక్ష్మి పథ కం ద్వారా రూ.17 కోట్లు రాగా.. నగదు చెల్లింపు టికెట్ల ద్వారా రూ.15 కోట్ల వరకు లభించింది. సంస్థ చరిత్రలో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేదు. సోమవారం 21.12 లక్షల మంది నగదు చెల్లించి  ప్రయాణించారు. 

38 లక్షల కిలోమీటర్లు..  

రాఖీ పండుగ సందర్భంగా బస్సులు రికార్డు స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. సగటున 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. సోమవారం 5 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయి.  మొత్తంగా 63 లక్షల మంది వరకు ప్రయాణించారు. రీజియన్ల వారీగా హైదరాబాద్ 12.91 లక్షలు, సికింద్రాబాద్ 11.68 లక్షలు, కరీంనగర్ 6.37 లక్షలు, మహబుబ్‌నగర్ 5.84 లక్షలు, వరంగల్ 5.82 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేశాయి. 97 డిపోలకు 92 డిపోలు 100 శాతానికి పైగా ఓఆర్‌ను నమోదు చేశాయి. 

ప్రజలను సురక్షితంగా చేర్చిన సిబ్బందికి అభినందనలు

ప్రజారవాణా వ్యవస్థపై ప్రజల ఆదరాభిమానాలు ఎంతలా ఉన్నాయో చెప్పడానికి రాఖీ పండుగ రికార్డులే నిదర్శనం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపా యం అందించే మహాలక్ష్మి పథకం విజయవంతం అవ్వడం సంతోషాన్నిస్తోంది.  ప్రజారవాణా వ్యవస్థలో తెలంగాణ ఆర్టీసీ రాఖీ పండుగ రికార్డులు మైలురాయిగా నిలిచిపోతాయి. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బంది అభినందనీయులు. రద్దీ ఉన్న రూట్లలో బస్సులు అదనంగా నడిపించారు. రాఖీ పండ గ ఉన్నప్పటికీ సిబ్బంది నిరంతరం శ్రమించా రు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూడా బస్సుల్లోనే వారి సోదరీమణులు రాఖీలు కట్టడం చూస్తే విధుల పట్ల వారి అంకితభావం అర్థమవుతుంది.   

-పొన్నం ప్రభాకర్,  రవాణాశాఖ మంత్రి 

నిరంతరం సమీక్షించాం

రాఖీ పండుగ రద్దీ, మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నాం. రెండు వారాల్లో మూడుసార్లు క్షేత్రస్థాయి సిబ్బందితో వర్చ్‌వల్‌గా యాజమాన్యం సమావేశం నిర్వహించింది. మూడు రోజుల్లో 2,587 ప్రత్యేక బస్సులను నడిపించాం. ్ర ముందస్తు ప్రణాళికతోపాటు సిబ్బంది నిబద్ధతతో పనిచేయడం వల్ల  ప్రయాణికులను క్షేమంగా  గమ్యస్థానాలకు చేర్చగలిగాం.  ఆర్టీసీకి సహకరిస్తున్న  ప్రయాణికులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు.  వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఎండీ