calender_icon.png 20 January, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

20-01-2026 01:42:09 AM

ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ

ఏకగ్రీవమైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి లక్ష్మణ్

నేడు బాధ్యతలు స్వీకరించనున్న నితిన్

న్యూఢిల్లీ, జనవరి 19: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం లో జరిగిన నామినేషన్ల ప్రక్రియలో ఆయన ఒక్కరే బరిలో నిలవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు పార్టీ జాతీయ ఎన్నికల అధికారి డాక్టర్ కె లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించారు. నితిన్ నబీన్ అభ్యర్థిత్వాన్ని బలపరు స్తూ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా సహా పార్టీ అగ్రనేతలు మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు నితిన్ నబీన్ ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు.

బీహార్‌కు చెందిన ఈ యువ నేత నితిన్ నబీన్ కేవలం 45 ఏళ్ల వయస్సులోనే పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవి అధిరోహించిన తొలి నేతగా సరికొత్త రికార్డు సృష్టించారు. అలాగే బీహార్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవి అలంకరించిన తొలి నేతగానూ ఆయన రికార్డు నెలకొల్పారు. గతంలో 52 ఏళ్ల వయస్సులో పార్టీ అధ్యక్షుడి పదవి దక్కించుకున్న నేతగా నితిన్ గడ్కరీ పేర రికార్డు ఉంది. ఆ రికార్డును తాజాగా నితిన్‌నబీన్ బద్దలుకొట్టారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారం లోకి తెచ్చేందుకు ఆయన చేసిన కృషిని పార్టీ గుర్తించింది. పార్టీ ఆయనకు గతేడాది డిసెంబర్‌లో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్య క్షుడి బాధ్యతలు అప్పగించింది. అనతికాలంలోనే ఆయన పార్టీ పెద్దల మెప్పు పొంది, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించడం విశేషం.